Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
రైతులను కష్టాలు, నష్టాలు వెన్నంటే ఉంటున్నాయి. వరి కోతల సమయంలో, పంట నూర్పిడి సమయంలో, దాన్యం విక్రయించే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో చేతికొచ్చిన పంట లను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సోమవారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, బోగారం, లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నిర్నేముల, దుబ్బాక, మునిపంపుల, రామన్నపేట, ఇంద్రపాల నగరం గ్రామాల దాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరడంతో తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలితో పట్టాలు లేచిపోయాయి. పల్లపు ప్రాంతాల్లో పోసుకున్న రాసుల కిందకు వరదనీరు చేరిపోయింది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సీసీ పైన పోసుకున్న ధాన్యం రాశుల కిందికి నీరు చేరడంతో ముద్దయింది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
జాప్యం చేయకుండా తడిసిన ధాన్యాన్ని సైతం అధికారులు వెనువెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం, ప్రారంభించిన అనంతరం వారం పది రోజులకు కొనుగోళ్లు మొదలుపెట్టడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం నిర్ణయంలో జాప్యం ఒకెత్తయితే, అధికారుల అలసత్వం మరో ఎత్తు అని ఆయన ఆరోపించారు. కోతలు ప్రారంభం కాగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లుగానే కొనుగోలు చేస్తే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని అన్నారు. అకాల వర్షం వల్ల తడిచిన ధాన్యంను ఎలాంటి వంకలు పెట్టొద్దని, కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆలేరుటౌన్ : ఉరుములు మెరుపులు ఈదురు గాలుల తో కూడిన వర్షం పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం పడింది.గాలి దుమారం రావడంతో విద్యుత్తుకు గంట పాటు అంతరాయం ఏర్పడింది సాయంత్రం వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది . వర్షం కారణంగా ఎండ వేడిమి నుంచి విముక్తి లభించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఉపశమనం పొందారు .
మోత్కూరు: మోత్కూరు మండలంలో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సుమారు అరగంటపాటు వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులతో కోతకు
వచ్చిన వరి చేలల్లో ధాన్యం రాలిపోయింది. వరి చేలు నేలకొరిగాయి. మోత్కూరు, కొండాపురం, కొండగడప, పాటిమట్ల, పాలడుగు, దత్తప్పగూడెం, ముశిపట్ల తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో, కళ్లాల్లో పోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో సుమారు 200లకు పైగా ధాన్యం రాశులు ఉండగా ఒక్కసారిగా కురిసిన వర్షంతో పూర్తిగా తడిసిపోయింది. వరద నీటికి పలువురు రైతులకు చెందిన ధాన్యం కొట్టుకపోయింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో రైతులు వరి చేలు దెబ్బతింటాయని ఆందోళనకు గురవుతున్నారు. మామిడి తోటల్లో గాలులకు కాయలు నేలరాలాయి. మండలంలోని దాచారం గ్రామంలో పిడుగు పడి తాటిచెట్టు కాలిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులతో పాటు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు డిమాండ్ చేశారు.
గుండాల : మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. వరి కోసిన రైతులు ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల కేంద్రాల్లో ధాన్యపు రాసులు పోశారు. కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం వస్తే ధాన్యం కొట్టుకుపోయే ప్రమాదముందని కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
బొమ్మలరామారం: పిడుగుపాటుకు ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలోని మర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... గ్రామానికి చెందిన మన్నె రాములు (70) రోజువారీగా పని నిమిత్తం వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళాడు. సోమవారం రోజున మధ్యాహ్న సమయంలో ఒఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది, ఒక్కసారిగా పిడుగు పడడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు మండలాల్లో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఐకెపి సెంటర్లో దగ్గర అమ్మకాల కోసం రైతులు తీసుకువచ్చిన ధాన్యం తడిసి అక్కడక్కడ కొట్టుకుపోయింది. పలు గ్రామాలలో చేతికొచ్చిన పంట నేలకొరగి ధాన్యం గింజలు నెల పాలయ్యాయి. దీంతో రైతులు కంటనీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అలసత్వం ప్రదర్శించడంతో టే కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యం తడిసిపోయింది అని ఆవేదన వ్యక్తి చేశారు.