Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్ వెనకబాటుకు జానారెడ్డే కారణం
- ఉపఎన్నికలో భగత్ గెలుపు ఖాయం
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హాలియా
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న 70వేల ఎకరాల పంట పొలాలను ఐదు దశాబ్దాల కాలంలో నీరందించకుండా ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.అందులో 35 ఏండ్లు శాసనసభ్యుడిగా, 14ఏండ్ల పాటు మంత్రిగా అధికారం చేపట్టి పెత్తనం చెలాయించింది కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కాదా అని ఆయన నిప్పులు చెరిగారు. అటువంటి అభ్యర్థికి ఓట్లు వేయమని ఏ మొహం పెట్టుకొని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగు తున్నారని ఆయన ఎద్దేవాచేశారు. నాగార్జుసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం అనుమల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోములభగత్తో కలసి ఆయన పాల్గొన్నారు. ఆప్కాబ్ మాజీ చైర్మెన్ యెడవల్లి విజయేందర్ రెడ్డి,జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మెన్ ఇరిగి పెద్దులు తదితరులు పాల్గొన్నారు. సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు ముమ్మాటికీ జానారెడ్డే కారణమని ఆరోపించారు. అటువంటి అభ్యర్థి నిజస్వరూపం గమనించిన తర్వాత నియోజకవర్గ ప్రజలు 2018 లోనే ఆయనను తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే స్వరాష్ట్రంలో సుపరిపాలన మొదలైందని నియోజకవర్గ పరిధిలోని రాజవరం మొదటి మేజర్ కింద భూములు సస్యశ్యామలం కావడానికి అదే కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మొదటి మేజర్ కు నీళ్లు ఇవ్వడంతో పాటు నెల్లికల్లు రైతుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు రూ.2,395.68 కోట్ల నిధులతో 13ఎత్తిపోతల పథకాలకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్లు లిఫ్ట్ కు ఫిబ్రవరి10న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారని ఆయన చెప్పారు.అనంతరం హాలియాకు సమీపంలోని 14వ మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నల్లగొండ జిల్లాకు వరాల జల్లులు కురిపించారన్నారు. అభివద్ధి మీద చర్చకు రమ్మంటే రాకుండా జానారెడ్డి తోక ముడిచింది నిజం కాదా అని ఆయన నిలదీశారు.అటువంటి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా నియోజకవర్గానికి ఒరిగేది ఏమి లేదన్నది ప్రజలు గుర్తించారని, ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని జోస్యం చెప్పారు.