Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
తెలంగాణకు కుందూరు జానారెడ్డి ఎవరెస్టు శిఖరం లాంటివారని, ఆయన గెలిస్తే నైతిక విలువలు గెలిచినట్టేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని విజయవిహార్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.మాజీ సీఎంలు రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థులైనా రాజకీయ సంప్రదాయం కాపాడేందుకు కషి చేశారన్నారు. 26 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశంపైన ఒంటికాలితో పి.జనార్దన్‌రెడ్డి పోరాటం చేశారన్నారు.సొంత పార్టీలో రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుపోతున్నాడంటూ పోరాడారన్నారు. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు శాసనసభలో ప్రజల సమస్యలపై నోముల నర్సింహయ్య కొట్లాడే వారని నోముల నర్సింహయ్య టీఆర్ఎస్లో చేరి 2018లో గెలిచిన తర్వాత శాసనసభలో రెండు సంవత్సరాలలో ఒక్కసారి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.నోముల నర్సింహయ్య టీఆర్ఎస్లో చేరిన తర్వాతనే ప్రజల నుండి కనుమరుగై పోవడమే కాకుండా రాజకీయంగా కేసీఆర్ సమాధి చేశాడని తెలిపారు.నోముల నర్సింహయ్యను మంత్రిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.ఆలుగడ్డలు అమ్ముకునే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిని చేశారన్నారు.నోముల నర్సింహయ్య కుటుంబానికి తప్పించి మిగతా అందరి పేర్లు కెేసీఆర్ పరిశీలించాడని దీని ద్వారా ఆయన ఆత్మ క్షోభించలేదా అని నిలదీశారు.చివరి నిముషంలో నర్సింహయ్య కొడుకుకు కేసీఆర్ టికెట్ కేటాయించారని తెలిపారు.నర్సింహయ్యను అవమానించి రాజకీయ సమాధి చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలుపు ఖాయమైంది కాబట్టే నోముల నర్సింహయ్య కొడుకుకు కేసీఆర్ టికెట్ ఇచ్చాడు ఎందుకంటే నాగార్జునసాగర్ ఓటమిని నోముల నర్సింహయ్య కుటుంబం ఖాతాలో వేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఎద్దేవా చేశారు.నేడు కేసీఆర్ నిర్వహించే బహిరంగసభలో కరోనా నియమాలను ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్టేనని ఆరోపించారు.అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణను సాధించింది జానారెడ్డి కాదా అని ప్రశ్నించారు.తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషించింది జానారెడ్డి కాదా ఈరోజు జానారెడ్డిని ఎందుకు ఓడించాలని కుట్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.నాగార్జునసాగర్‌లో 1000 కిలోమీటర్ల రోడ్లు, 35 వేల ఇందిరమ్మ ఇండ్లు, రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది జానారెడ్డి అన్నారు.శాసనసభను కెేసీఆర్ కల్లు కాంపౌండ్‌లా మార్చాడని, శాసనసభలో చర్చలు లేవు ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.శాసన సభను కేసీఆర్ రాజకీయ రేవ్ పార్టీ వేదికగా మార్చడాని అన్నారు.కేసీఆర్ గులాబీవనంలో గంజాయి మొక్కలను పెంచి పోషించాడని అన్నారు.గులాబీ వనంలో ఉన్న గంజాయి మొక్కలను, చీడపీడలను జానారెడ్డి ఎత్తిచూపుతాడని కెసిఆర్ కక్ష కట్టాడని తెలిపారు.కెసిఆర్ రెండోసారి సభ పెడుతున్నాడు అంటేనే ఓటమిని ఒప్పుకున్నట్లేనని అన్నారు.హాలియలో నిర్వహించిన సభలో జానారెడ్డి విసిరిన సవాల్‌ను ఒప్పుకోకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడో నేడు సభలో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇప్పుడు ఒక పెద్ద దిక్కు కావాలి..అంటే జానారెడ్డిని గెలిపించాలి..జానారెడ్డి ఓడిపోతే ఆయనకు పోయేదేమీ లేదు..టీఆర్ఎస్ శ్రేణులకు దండం పెట్టి చెబుతున్నా జానారెడ్డి ఓడిపోతే తెలంగాణ సమాజం ఒక పెద్దదిక్కును కోల్పోతుందన్నారు.కేసీఆర్ రెండోసారి బహిరంగ సభకు ఎందుకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని కోరారు.బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, ఎన్నికలలో ఒకరికొకరు సహకరించు కుంటున్నాయన్నారు.ఆయన్ను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి ప్రదీప్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.