Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసౌకర్యాతోనే యాదాద్రి ఆలయం ఓపెనింగా..
- భక్తులకు నిలువ నీడలేదు
- మంచినీళ్లు రావు..మరుగుదొడ్లు లేవు
- వాహనాల పార్కింగ్‌కు స్థలమే కరువు
- పాలకులకు భక్తుల బాధలు పట్టవా..?
నవతెలంగాణ - యాదాద్రి
యాదాద్రి ఆలయ ప్రారంభానికి పాలకులు పడుతోన్న ఆతృత, ఆరాటం చూస్తే హవ్వ..నవ్విపోదురాగాక....నాకేంటీ సిగ్గు అన్నట్టు అనిపించకపోదు. అభివృద్ధి పనులు సాగుతున్న సమయంలో ప్రధాన ఆలయం ప్రారంభం అంశం తెరమీదకొచ్చింది. చిన్న జీయర్ చెప్పారు...సీఎం పరిశీలిస్తున్నారు...సీఎంవో ఆఫీస్ సమీక్షలు జరుపుతోంది.... వైటీడీఏ సన్నాహాలు చేస్తోంది...ఇవన్నీ ముచ్చట్లు వింటుంటే ఆలయ సందర్శనకు వెళ్లాలా...? వద్దా...? అనే డైలమాలో పడిపోతున్నా భక్తులు. ప్రారంభం సరే..అసలు సౌకర్యాల మాటే ఎవరూ ఎత్తక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ప్రస్తుతం ప్రధాన ఆలయం కాకుండా ఇతర నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇక్కడ పనులు సాగుతున్నా ప్రభుత్వం, అధికారులు ఆలయ ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ప్రారంభం అటుంచితే యాదాద్రి టెంపుల్ ఏరియాలో నిలువ నీడలేదు. కొండపైన క్యూలైన్ వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి మినహా డెవలప్మెంట్ జరుగుతోన్న పరిధిలో ఎక్కడా లేదు. ఇప్పటికే వేల సంఖ్యలో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులతో కొండంత కిటకిటలాడుతోంది. ఇక మెయిన్ టెంపుల్ ప్రారంభిస్తే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోందని సీఎంతో పాటు ఆఫీసర్లు కూడా పలు సందర్భాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రద్దీకి సరిపడా సౌకర్యాల కల్పన ఊసే ఎత్తకపోవడం బాధాకరం. సందర్శనకు వచ్చిన భక్తులు రోజూ వందల సంఖ్యలో సత్యదేవుని వ్రతాలు చేయడం, నిత్య కల్యాణం చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహిచడం, తనీలాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన నిర్మాణాలు కొండకింది భాగంలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమాలు అరకొర వసతుల మధ్య భక్తుల కాలం వెళ్లదీస్తున్నారు.
అన్ని అసౌకర్యాలే
ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు స్నానాలు చేయడానికి పుష్కరిణి లేదు. ప్రత్యేకించి మంచినీటి వసతి లేదు. మరుగుదొడ్లు సరిగా లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండపైన నిలబడడానికి చోటే లేదు. కొండకింద కూడా డెవలప్మెంట్ జరుగుతోన్న ఏరియాలో ఎక్కడా భక్తులు సేద తీరే పరిస్థితులు లేవు. ఇంకా వాహన పార్కింగ్ ప్లేస్ లేక రోడ్ల పైనే నిలబెడుతున్నారు. దీనికి కూడా పార్కింగ్ డబ్బు వసూలు చేస్తున్నారు. సాధారణ భక్తులు గుట్టలో బస్సు దిగిందే తరువాయి వారికి కష్టాలు మొదయ్యినట్టే. ఎందుకంటే అద్దె గదుల కొరత తీవ్రంగా ఉంది. కొండపైకి చేరుకోవడానికి ఒకటే ఘాట్ రోడ్డు ఉంది. మొదటిఘాట్ రోడ్డు మరమ్మతులు చేస్తుండటంతో పూర్తిగా మూసేవేశారు. ఉన్న రోడ్డు వెంట రాత్రి సమయాల్లో లైట్లు కూడా వెలగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ఆలయం ప్రారంభిస్తే భక్తులు అనేక ఇబ్బందులు పడతారని పలువురు పేర్కొంటున్నారు.
తొందరేముందీ
అసౌకర్యాలతోనే యాదాద్రి ప్రధాన ఆలయం ప్రారంభించాలని ఏముంది...? ఇంతా ఆఘమేఘాలపై యాగాలు, హోమాలు నిర్వహించాలని ఏముంది...? ఎందుకా తొందరా...? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. కేవలం వీఐపీలకు మాత్రం సకల సౌకర్యాలు ఉంటే సరిపోతుందా..అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించిన తర్వాతే ఆలయాన్ని ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు.