Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
టీఆర్ఎస్ పాలనలో హామీలు ఘనం అమలు శూన్యమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా ఆరోపించారు.బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత హామీలను విస్మరించడం టీఆర్ఎస్కే సాధ్యమన్నారు.ఈ మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రైవేట్ పాఠశాలలు తెరిపించి, వారి ఓట్లను ఉపయోగించుకొని ఎన్నికలు ముగియగానే కరోనా సాకుతో మూసివేయడం అందుకు నిదర్శనమన్నారు.నేడు సాగర్ ఎన్నికల సమయం కావున 13 నెలలుగా గుర్తుకు రాని ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం బియ్యం పంపిణీ చేయడం ఎన్నికల కోసమేనన్నారు.ఎన్నికల ప్రచారంలో, బార్ అండ్ రెస్టారెంట్లో, సినిమా థియేటర్లలో లేని కరోనా పాఠశాలలో మాత్రమే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.అన్ని నిబంధనలు పాటిస్తూ నడిపే పాఠశాలను మూసివేయడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. లక్ష మందితో ఏ విధమైన నిబంధనలు లేకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి సభ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు కరోనా నిబంధనలు అవసరం లేదా అన్నారు. సామాన్య ప్రజలకేనా కరోనా నిబంధనలు అన్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది ప్రైవేటు టీచర్లు ఉండగా లక్షా 60 వేల మందికే బడ్జెట్ కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. రెండేండ్లుగా రేషన్‌కార్డులు, పింఛన్లపై నోరుమెదపని వారు ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించడంలో నిజం ఎంతవరకు ఉంటుందన్నారు.ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి లబ్దిచేకూరేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.