Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలితాలు వచ్చిన తర్వాత 20 రోజుల్లో మళ్లీ సాగర్‌కు వస్తా
- నోముల భగత్ గెలుపు ఖాయం
- హాలియా ఎన్నికల సభలో సీఎం కేసీఆర్
- జానారెడ్డిపై విమర్శలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
'ఏడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజక వర్గానికి ఏం చేసిండు. ఇక్కడ అభివృద్ధి మొత్తం కుంటు పడింది. 20 రోజుల్లో మళ్లీ ఇక్కడికి వస్తా..అభివృద్ధి ఏంటో నేను చేసి చూపిస్తా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్ గెలుపును కాంక్షిస్తూ హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. సీఎం కేసీఆర్ సభా స్థలికి దగ్గరికి ఆరు గంటలకు వచ్చారు. వేదికపైకి 6.10 నిమిషాలకు చేరుకున్నారు. వేదికపైకి రావడంతోనే ప్రజలకు అభివాదం చేశారు. ఆయనతో పాటు అభ్యర్థి భగత్ కూడా ప్రజలకు నమస్కరిస్తూ వేదికకి వచ్చారు. సభలో మొదట మంత్రి జగదీష్‌రెడ్డి ప్రసంగించారు. తర్వాత అభ్యర్థి భగత్ తక్కువ సమయంలోనే మాట్లాడి ప్రసంగం ముగించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు. మాజీ మంత్రి జానారెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 40 ఏండ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన పెద్దాయన ఒక్క డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నోముల నర్సింహయ్యను గుర్తు చేసుకుంటే దుఖం వస్తుందని, ఆయన వామపక్ష ఉద్యమాల్లో పనిచేసి నిత్యం పేదల తరపున పోరాడారన్నారు. ఆయన ఒత్తిడి చేస్తే హాలియాలో డిగ్రీ కాలేజీని మంజూరు చేసినట్టు తెలిపారు. సాగర్ గురుకుల పాఠశాలలో కూడా మరో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. సాగర్‌లో ఉన్న ఇండ్ల స్థలాల పంచాయతీని, గిరిజనుల పోడు భూముల సంగతిని తేల్చేస్తానని, ఇలాంటి భూముల సమస్యకు నాగార్జున సాగర్ నుంచి పరిష్కారానికి శ్రీకారం చుడతామన్నారు. భగత్ గెలిచిన తర్వాత 20 రోజులకు వస్తా.. రాష్ట్ర స్థాయి అధికారులను తీసుకొచ్చి అవసరమైతే రెండు రోజులు ఇక్కడే ఉండి అభివృద్ధి అంటే ఎలా ఉంటదో చేసి చూపిస్తా అని అన్నారు. ప్రస్తుతం ఉన్న పథకాల గురించే పదే పదే పేర్కొన్న సీఎం కొత్తవాటిని గురించి ప్రస్తావన తేలేదు. సీఎం రాకముందే వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులందరి వద్దకు భగత్ వెళ్లి పలకరించారు. హోంమంత్రి మహమూద్ ఆలీ ఆయన్ను అప్యాయంగా పలకరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేంగా వేదికపైనే మాట్లాడారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా అప్యాయంగా అలింగనం చేసుకున్నారు. అభ్యర్థి భగత్, ఆయన తల్లి లక్ష్మి వేదికపై నుంచి ప్రజలందరికి అభివాదం చేశారు. సభలో ఆయన మాట్లాడుతుండగా యువత నుంచి కేరింతలు పెద్ద ఎత్తున వచ్చాయి. సీఎం మాట్లాడుతున్న సమయంలో వాటిని ఉద్దేశించిన భగత్ గెలుపు ఖాయంగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. ఎంసీ కోటిరెడ్డిని తప్పకుండా ఎమ్మెల్సీ చేస్తామని, కడారి అంజయ్యకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. సీఎం ప్రకటన తర్వాత అక్కడే ఉన్న కోటిరెడ్డి కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఈ సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంగేళ్లపల్లి రవీందర్రావు, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గొంగిడి సునిత, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, శంకర్ నాయక్, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.