Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రథసారధి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-యాదాద్రి
సాగు, తాగు నీటి కోసం గంధమల్ల ప్రాజెక్టే శరణ్యమని తలచిన ఆలేరు నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని యాదాద్రిభువనగిరి సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ విమర్శించారు. 30 ఏండ్లుగా ఆలేరు ప్రాంతాన్ని పాలకులు ఎడారిగా మార్చారని మండిపడ్డారు. యాదాద్రిభువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ (ఎం) చేపట్టిన జనచైతన్య యాత్ర గురువారం యాదగిరిగుట్ట మండలం కేంద్రానికి చేరుకుంది. యాత్ర బృందానికి పట్టణ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. బస్టాండ్ ఆవరణలో జరిగిన సభలో పార్టీ కార్యదర్శి మాట్లాడారు. 9 టీఎంసీల నీటి సామర్థ్యంతో గంధమల్లలో ప్రాజెక్టు నిర్మించబోతున్నట్టు ఇక్కడి ప్రజలకు వాగ్దానం చేసిన టీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసేత్తకపోవడం శోచనీయమన్నారు. నేటి పాలకులు వాగ్దాన శూరులుగా పేరుగాంచారని విమర్శించారు. చిత్తశుద్ది లేని ఏలికదారుల వల్ల ఈ ప్రాంత వ్యవసాయ భూములకు సాగునీరు అందటం లేదన్నారు. గోదావరి జలాలతో గంధమల్ల ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రజలను మోసిగించిన స్థానిక ఎమ్మెల్యే ఓట్లు రాల్చుకున్నారని ధ్వజమెత్తారు. ఇలా నయవంచన చేసిన ఎమ్మెల్యే రానున్న ఎలక్షన్ సమయంలో ఓటుతో తగినబుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా గంధమల్ల ప్రాజెక్టుపై పాలకులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో సీపీఐ (ఎం) నేతృత్వంలో ప్రాజెక్టు కోసం పోరు సలుపుతామని హెచ్చరించారు. ఈ సభలో పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహ, ,మాటూరి బాలారాజు, కల్లూరి మల్లేషం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధరావత్ రమేష్ నాయక్, మండల పార్టీ కార్యదర్శి బబ్బూరి పోశెట్టి, యాదగిరిగుట్ట పార్టీ కార్యదర్శి కానుగంటి నర్సింగరావు పాల్గొన్నారు.