Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తి, ప్రాణ నష్టం నివారణలో వారి సేవలు కీలకం
- 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు
- మోత్కూర్లో హైఎక్విప్ మెంట్ ఉన్న అగ్నిమాపక యంత్రం
నవతెలంగాణ- మోత్కూర్
అగ్ని ప్రమాదం... అది ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి దారి తీయవచ్చు. ప్రమాదం జరిగి నిమిషాలు గడిచేకొద్దీ అపారమైన నష్టం జరుగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే మేల్కొని ఎంత త్వరగా ప్రమాదాన్ని నిలువరించగలిగితే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు. ఇక వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాల గురించి చెప్పనవసరం లేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సైరన్ మోగించుకుంటూ నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. 1944 ఏప్రిల్ 14న ముంబై డాక్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రజలను కాపాడే సమయంలో 66 మంది అగ్నిమాపక ఫైటర్స్ ప్రాణాలు కోల్పోయారు. నాటి నుంచి వారి జ్ఞాపకార్థం ప్రతియేటా అగ్నిమాపక శాఖ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా మోత్కూర్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు
అగ్నిమాపక అమరవీరుల జ్ఞాపకార్థం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహించి అగ్ని ప్రమాదాలు, ప్రకతి వైపరీత్యాల పై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 14న అమరవీరులకు నివాళులు, 15న దుకాణాలు, మెయిన్ సెంటర్లలో మాక్ డ్రిల్ తో అవగాహన, 16న నివాస ప్రాంతాల్లో, ఇళ్ళలో జరిగే అగ్ని ప్రమాదాలు, వంట గ్యాస్ సిలిండర్ లీకేజీలు, పేలుళ్లపై, 17 పెట్రోల్ బంకులు, పరిశ్రమలు, ఇతర వ్యాపార కేంద్రాల్లో, 18న ఆస్పత్రుల్లో, 19న స్కూళ్లు, కాలేజీల్లో డెమో లు, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు, 20న సమావేశం నిర్వహించి ప్రముఖులతో సందేశాలు, బహుమతుల పంపిణీ చేయనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అగ్నిమాపక శాఖ నెంబర్ 101 ఎంతో కీలకం. ప్రమాదంపై ఆ నెంబర్ కు కాకపోయినా 100 కు కాల్ చేసి విషయం చెబితే పోలీసులు కూడా అలర్ట్ అయి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇస్తారు.
మోత్కూర్ లో హై ఎక్విప్మెంట్ ఉన్న అగ్నిమాపక వాహనం
మున్సిపల్ కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో హై ఎక్విప్ మెంట్ ఉన్న వాహనం ఉంది. 2017 మోడల్( మల్టీ పర్పస్ టెండర్) వాహనం ఇది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోత్కూర్తో పాటు ఆలేరు, యాదగిరిగుట్ట కేంద్రాల్లో మాత్రమే ఈ వాహనాలు ఉన్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కషితో మోత్కూర్ కు అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయించి 2018 సెప్టెంబర్ 5న అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఎక్కడ ఉన్నా ఈ వాహనం వెళ్లాల్సిందే అంటే దాని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. ట్యాంకర్ 4500 లీటర్ల కెపాసిటీ, ఆయిల్ మంటలు ఆపేందుకు 500 లీటర్ల కెపాసిటీ ఫోమ్ ట్యాంకర్, డ్రై కెమికల్ పౌడర్ ట్యాంక్, సీవో2 టెస్టింగ్ విషర్, మానిటర్, నిచ్చెన, రోప్స్, 2 ఫైర్ సూట్స్, 2 బ్రీతింగ్ ఆపరేటర్, 2 ఆక్సిజన్ సిలిండర్లు, వాహనం వెళ్ళలేని ప్రదేశాల్లో మంటలు ఆర్పేందుకు పోర్టబుల్ పంప్, 22 మీటర్ల పైపులు (30 సెట్లు) లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అగ్నిమాపక కేంద్రం అందుబాటులోకి రావడంతో మోత్కూర్, గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూర్(యం), తిరుమలగిరి, నార్కట్ పల్లి, శాలిగౌరారం మండలాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా నిమిషాల్లో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలర్పుతున్నారు. మోత్కూర్ కేంద్రంలో 16 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సాయిదీపక్ తో పాటు లీడ్ ఫైర్ మెన్లు ఇద్దరు, డ్రైవర్లు ఇద్దరు, ఫైర్ మెన్లు ఏడుగురు ఉన్నారు. 24 గంటలు షిఫ్ట్ కు ఆరుగురు పని చేస్తున్నారు
24 గంటలు సేవలందిస్తాం
అగ్ని ప్రమాదాల నివారణకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తాం. ప్రమాదంపై 101కు కాల్ చేసిన వెంటనే అప్రమత్తమవుతాం. అగ్ని ప్రమాదమైన, ఇతర ఏ ప్రకతి వైపరిత్యమైన ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టం జరగకుండా సేవలందిస్తున్నాం. ప్రమాదాల పట్ల ప్రజలు ఆలస్యం, నిర్లక్ష్యం చేయవద్దు. మోత్కూర్ పరిధిలో అగ్ని ప్రమాదాలు జరిగితే స్టేషన్ నెంబర్ 9493945101 లేదా 9121066935కి ఫోన్ చేయవచ్చు.
ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కంగారులో అగ్నిమాపక కేంద్రం నెంబర్ తెలియకపోతే 100కు కాల్ చేసినా పోలీసులు అప్రమత్తం చేస్తారు. ప్రమాదం నివారణకు పోలీసులు కూడా సేవలు అందిస్తారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలు, రైతులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.