Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్
నవతెలంగాణ -భువనగిరి రూరల్
భువనగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలంలోని హన్మాపురం గ్రామంలో నిర్వహించిన జనచైతన్య పాదయాత్ర సభలో ఆయన మాట్లాడారు. భువనగిరితో పాటుగా కొలనుపాక, యాదగిరిగుట్ట, ఇంద్రపాల నగరం, రాచకొండ, పోచంపల్లి చేనేత పార్కు లాంటివి టూరిజం కేంద్రాలుగా అభివద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరి ఖిల్లా వద్ద రోప్ వేనిర్మాణం భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు చేయాలన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఆడిటోరియం ఏర్పాటు చేయాలని నందనం గ్రామంలో నీరా, తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించి, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. మూసి నది ని జిల్లాలో ప్రవహించే మండలాలలో ప్రక్షాళన చేసి ప్రజలు, పశువులు, ఆహార పదార్థాలతో అనారోగ్యం బారిన పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాకు సంబంధించిన పర్యాటక ప్రదేశాలను సాంకేతికత సహాయంతో రూట్ మ్యాప్ లను రూపొందించి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా వెబ్ సైట్లలో సమాచారం పెట్టాలని కోరారు.