Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లాలోని స్థానిక పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని హనుమాపురం గ్రామానికి జనచైతన్య పాదయాత్ర చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య పాదయాత్ర జిల్లా వ్యాప్తంగా 26 రోజుల పర్యటన చేసిందన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీబీనగర్, పోచంపల్లి ముఖ్యమైన ఈ ప్రాంతాల్లో స్థానిక యువత ఉపాధి లేదని, దివిష్ లాంటి పరి శ్రమలలో 10,000 మంది చేసిన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదని విమర్శించారు. పోచంపల్లి మండలం దోతి గూడెం, చౌటుప్పల్ మండలం మందొల గూడెం గ్రామాలలో పరిశ్రమల కాలుష్యం వల్ల ఆ యా గ్రామాల ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కాలుష్య ప్రభావం వలన చర్మ వ్యాధులు, గర్భస్రావాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీపరివాహక ప్రాంతంగా ఉన్న పోచంపల్లి , వలిగొండ, బీబీనగర్ రామన్నపేట మండలం లో వరి పంటలు తెగుళ్ళ బారిన పడుతున్నాయనీ, పంట దిగుబడి తక్కువ వస్తుందని, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. తక్షణమే మూసీ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోట కొండూరు మండలం పిట్టల గూడెం గ్రామంలో ఇల్లు లేక అనేక మంది పేద గిరిజనులు అవస్థలు పడుతున్నారన్నారు. రాత్రివేళల్లో అందరూ నిద్ర పోయిన తర్వాత మహిళలు స్నానాలు చేసే దౌర్భాగ్యపు పరిస్థితిలో ఆ గ్రామం ఉన్నదన్నారు. , పిట్టల గూడెంలో ఒక్క బాత్రూం కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఒక మహిళ కూడా ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. వెంటనే ఆ గ్రామానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.