Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ రంగనాథ్
- 4,000 పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపుభద్రతకు ప్రత్యేకచర్యలు
- పారామిలటరీ బలగాల పహారాలో ఈవీఎంల తరలింపు
నవతెలంగాణ-హాలియా
నాగార్జున సాగర్ ఉపఎన్నికల పటిష్ట నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలించి పలు సూచనలు చేశామని డీఐజీ ఏవీ.రంగనాధ్ చెప్పారు.శుక్రవారం ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 108 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం 15 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, పోలింగ్ సరళిపై వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రతతో పాటు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు.మొత్తం 4 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా 3 వేల మంది సివిల్ పోలీసులు, వెయ్యికి పైగా పారా మిలటరీ పోలీసులు భద్రతలో భాగస్వామ్యం అవుతారని తెలిపారు.ఇప్పటికే సీఆర్పీఎఫ్, సీిఐఎస్ఎఫ్, తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.పోలింగ్ ముగిసే వరకు డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ లాంటి అంశాలపై తనిఖీలు కొనసాగుతాయని ఇందుకోసం ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని వివరించారు.ఇప్పటివరకు రూ.50 లక్షల నగదు, రూ.45 లక్షల మద్యం సీజ్ చేయడంతో పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద 190 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
భద్రతా ఏర్పాట్లు ఇలా.....
శనివారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పతిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.4 వేల మందికి పైగా భద్రతా విధులలో పాలుపంచుకోనుండగా ఇందులో జిల్లా ఎస్పీ - 1, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ, ఐదుగురు అదనపు ఎస్పీలు, ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 2,750 మంది సివిల్ పోలీస్ సిబ్బంది, 270 మంది కేంద్ర బలగాలు, మరో 270 మంది తెలంగాణ ప్రత్యేక పోలీసులు, వెయ్యికి పైగా ప్రత్యేకబందాలతో కూడిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
పారా మిలటరీ బలగాల భద్రత నడుమ ఈవీఎంల తరలింపు :
శనివారం సాయంత్రం 7-00 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సంబంధిత రిటర్నింగ్ అధికారి అనుమతితో ఈవీఎం మిషన్లను ఆయుధాలతో కూడిన పారా మిలటరీ బలగాల భద్రత మధ్య నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు.కౌంటింగ్ రోజు వరకూ పటిష్ట భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరుస్తారు.