Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్రలో అలుపెరగని సీపీఐ(ఎం) నేతలు
- అడుగడుగునా అన్ని వర్గాల జననీరాజనం
- జనచైతన్య యాత్రలో వినతుల వెల్లువ
- పాలకులను ఎండగట్టిన ఎర్రన్నలు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిభువనగిరి జిల్లాలో నెలకొన్న సాగు, తాగు నీరు, విద్య, వైద్యం, ఉపాధి, పెండింగ్ పింఛన్లు, తదితర ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సీపీఐ(ఎం) జిల్లా పార్టీ నడుంబిగించింది. పల్లెల్లోకి నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ జనచైతన్యకు శ్రీకారం చుట్టారు. మార్చి 23న రామన్నపేట మండల కేంద్రంలో మొదలైన ఈ యాత్రను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతరాములు ప్రారంభించారు. నాటి నుండి రేయింబవళ్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ నేతృత్వంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ధరావత్ రమేష్ నాయక్, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిపంగి స్వామిలు అలుపెరగకుండా ముందుకు సాగంగా ఈ యాత్ర అశేష ప్రజాదరణతో నేటి (17) వరకు కొనసాగింది. పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలను ఆయా గ్రామస్థులు స్వచ్ఛందంగా స్వాగతించి ఘనంగా సన్మానించారు. జిల్లాలోని 15 మండలాలతో పాటు ఆరు మున్సిపల్ కేంద్రాలు, 170 గ్రామాలు తిరుగుతూ సుమారు 785 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర నేటితో 26వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలో ముగింపు కానున్న ఈ జనచైతన్య పాదయాత్ర నేడు భువనగిరిలో జరగనున్న బహిరంగ సభతో ముగుస్తుంది. ఈ యాత్రకు ఆయా గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. బోనాలు, బతుకమ్మలు, కోలాట నృత్యాలు, డప్పు దర్వులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాలన్ని తోరణాలతో, ఫెక్సిలతో ఎరుపు వర్ణమైయ్యాయి. కళాకారుల ఆట, పాటలతో ప్రజలను మంత్రముగ్దులను చేశారు. వక్తల ప్రసంగాలతో జనం ఎంతో చైతన్యం పొందారు. పలుచోట్ల పువ్వులు చల్లుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. నేడు జరగనున్న ముగింపు సభలో కూడా రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పాల్గొంటారు.
పాదయాత్రలో పార్టీ ప్రముఖులు
జనచైతన్య పాదయాత్ర రామన్నపేట, చౌటుప్పల్, సంస్థనారాయణపురం, పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, మోటకొండూర్, ఆత్మకూర్, మోత్కూర్, అడ్డగూడూరు, గుండాల, ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల మీదుగా భువనగిరి మండలం చేరుకుంది. ఈ జనచైతన్య యాత్రలో జరిగిన వివిధ సభల్లో వ్యవసాయ సంఘం వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహరెడ్డి, రాష్ట్ర ్ట కార్యదర్శివర్గ సభ్యుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య పాల్గొని ప్రసంగించారు. వీరే గాక నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల పార్టీ కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, మోకు కనకారెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, నల్లగొండ సీఐటీయూ కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఈ యాత్రకు మద్దతు తెలుపుతూ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు.
ప్రభుత్వాలను ఎండగట్టిన ఎర్రన్నలు
కాగా అడుగడున పాదయాత్రకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు నీరాజనం పట్టారు.
ఫెన్షన్లు, రేషన్‌కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లుకు ప్రజల నుండి వినతులు భారీగా అందాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దివాలుకోరు తనానికి ప్రజల నుండి అందిన సమస్యల వినతులే చెప్పపెట్టని పలువురు వక్తలు చురకంటిచారు. ఉభయ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉంటే 26 రోజుల పాటు యాదాద్రిభువనగిరి జిల్లాలో చేపట్టిన సీపీఐ(ఎం) పాదయాత్రకు అందిన వినతుల మాటేంటీ అని నేతలు పాలకులను నిలదీశారు. ప్రజలెలా బ్రహ్మరథం పట్టారని ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.