Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్
- ఇన్చార్జి లేక కాంగ్రెస్ తండ్లాట
- ఇంకా ఖరారు కాని అభ్యర్థులు
- పొత్తులకు ససేమిరా అంటున్న బీజేపీ
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ పురపోరు రాజకీయాలు వేడె క్కాయి.ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు పర్వం సాగుతోంది. నామినేషన్ల పర్వానికి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో పడ్డారు. అధికార టీఆర్ఎస్ సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే బీఫాం అందజేస్తుండగా... కాంగ్రెస్ అభ్యర్థుల తండ్లాటలో పడి..ఇతర పార్టీలతో పొత్తు కోసం ఎదురు చూస్తోంది. ఇక తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని బీజేపీ స్పష్టం చేసింది. వామపక్షాల అభ్యర్థులు కూడా పోటీలో ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
సర్వే ప్రకారం అభ్యర్థుల ఎంపిక
మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. ఈ మేరకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మున్సిపాలిటీలోని వార్డులో సర్వే చేయించారు. గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చే పనిలో పడ్డారు. ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల్లో స్క్రీనింగ్ చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఏ వార్డులో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో జాబితా తీసుకున్నారు. ఉన్న జాబితాలో అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే దశ ముగింపుకు చేరుకుంది. ఒకవేళ జాబితాలో ఉన్న ఆశావహులకు అంతగా విజయ అవకాశాలు లేవని సర్వేలో తేలితే ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. 20 వార్డుల్లో ఇప్పటికీ 12 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. మిగిలిన వార్డులకు అధిక పోటీ ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రిజర్వేషన్లు అనుకూలంగా లేని కొంతమంది ఆశావాహులు, అవకాశాలు రాని వారిని సైతం బుజ్జగించే పనిలో ఉన్నారు.
ఇన్చార్జి లేక కాంగ్రెస్ తండ్లాట
నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌లో కాంగ్రెస్ అధిష్టానం ఏ ఒక్కరికీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించలేదు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన కూడా నేటికీ అభ్యర్థులను నిర్ధారించలేదు. శనివారం కాంగ్రెస్ మండలా ధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం ఆధర్యంలో నకిరేకల్‌కు చెందిన కొంత మంది కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. వెంకట్‌రెడ్డిని కలిసిన తర్వాత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిసింది. మండలాధ్యక్షుడు ఏసుపాదం ఆధ్వర్యంలో 20 వార్డులకు 20 మంది అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పినట్టు తెలిసింది. కలిసి వస్తే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గ్రూపు, లేక పోతే వామపక్షాలతో కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా పరిశీలించాలని ఆయన సూచించినట్టు సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం అవాస్తవమని ఆ పార్టీ నాయకులు కొట్టి పారేశారు.
20 వార్డుల్లోనూ సీపీఐ(ఎం) పోటీ
మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో సీపీఐ(ఎం) పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల్లో కలిసొచ్చే శక్తులను కలుపుకుపోతారని తెలిసింది.
ఇక బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి తెలిపారు. పట్టణంలో తమ పార్టీ బలం నిరూపించుకునేందుకు ఇది చక్కని అవకాశం అని తెలిపారు. ఏది ఏమైనా నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నాయకులు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగమయ్యారు.