Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించండి
- ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్
కేసీఆర్కు ఓట్లు, నోట్లు, సీట్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11, 14, 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అక్రమంగా డబ్బు ఖర్చు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ఉన్న వారిని అభ్యర్థులుగా నిలిపి టీఆర్ఎస్ ఓట్లు కొనే ప్రయత్నాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తులు అభ్యర్థులుగా ఉన్నారని వారిని గెలిపించి కేసీఆర్కు బుద్ధి చెప్పాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఒక్క దెబ్బ పడ్డ... తిరిగి పది దెబ్బలు టీఆర్ఎస్ నేతలు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్, మాజీ సర్పంచ్ పొన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.