Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
- 8056 ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
- రూ.13 కోట్లకు పైగా నష్టం
- 3 వేల ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు - రూ.2 కోట్ల నష్టం
- కేంద్రాల్లో తడిసి ముద్దైన ధాన్యం
- తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నల్లగొండ, నకిరేకల్‌లో రైతుల రాస్తారోకో
రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. వర్షానికి చేతికొచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. కళ్లాలు, మార్కెట్, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల వద్ద ఉంచిన వేలాది బస్తాల ధాన్యం తడిచి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో వరదల్లో కొట్టుకు పోయింది. కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తే ఇంత పెద్ద నష్టం జరిగేది కాదని రైతులు పేర్కొంటున్నారు.
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. నల్లగొండ జిల్లాలో గురువారం రాత్రి మాడ్గులపల్లిలో 50 మిల్లీ మీటర్లు, దామరచర్ల 43.2, మిర్యాలగూడలో 30.3, వేములపల్లిలో 28.6, నల్లగొండలో 23.5, తిప్పర్తిలో 23, కనగల్‌లో 14, చండూరులో 13.8, అడవిదేవులపల్లిలో 12.8, చిట్యాలలో 11.5, కేతేపల్లిలో 10.8, త్రిపురారంలో 10.7, గుర్రంపోడులో 10, హాలియాలో 4.3, మర్రిగూడలో 4.3, నాంపల్లిలో 3.7, నిడమనూర్‌లో 2.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 10.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, బీబీనగర్, రామన్నపేట, తుర్కపల్లి, మోటకొండూరు, గుండాల, భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూ రు, బొమ్మలరామారం, రాజాపేటలో వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, పెన్‌పహాడ్, మునగాల, పాలకవీడులో వర్షం కురిసింది.
నల్లగొండ జిల్లా మొత్తం 1189 మంది రైతులకు సంబంధించిన 2620 ఎకరాల వరి పంట దెబ్బతిన్నది. ఉద్యానవన పంటలైన నిమ్మ 1000, మామిడి 400, బత్తాయి 650, టమాట 50, బొప్పాయి 30, పచ్చిమిర్చి 20, కూరగాయల పందిళ్లు 20 ఎకరాలలో నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల బస్తాలకు పైగా ధాన్యం తడిచినట్టు తెలుస్తుంది. అయినా ధాన్యాన్ని పూర్తిగా మిల్లులకు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా
అకాల వర్షానికి సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో 350, పెన్‌పహాడ్ 400, మునగాల 158 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తంగా 908 ఎకరాల్లో 431 మంది రైతులకు సంబంధించిన పంట నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిచినట్టు అధికారులు తెలిపారు. ఇవే కాకుండా మామిడి, నిమ్మ తోటలు 456 హెక్టార్లల్లో నష్టం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ..
యాదాద్రి జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా 13 మండలాలు, 34 గ్రామాల్లో 5127 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 1006 ఎకరాల్లో నష్టం జరిగింది. ఇదే గాకుండా ఈనెల 20వ తేదీన వచ్చిన వానతో సుమారు 1685 ఎకరాల వరి పంటకు నష్టం జరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. భువనగిరి మండంలో మూడు పాడి గేదేలు మృత్యువాత పడగా ఒక పశువుల కొట్టం కూలిపోయింది.