Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు బదిలీ అయినా బోర్డుల్లో మారని పేర్లు
- పేర్లు, నెంబర్లు తెలీక రోగుల ఇబ్బందులు
నవతెలంగాణ -చిట్యాల
ప్రజలకు మెరుగైన సమాచారం అందించాల్సిన అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు. అధికారులు బదిలీ అయ్యి ఏండ్లు గడుస్తున్నా వారి పేర్లు కార్యాలయాల్లో అలాగే దర్శనమిస్తున్నాయి. బాధితులు ఎవరైనా కార్యాలయాలకు వచ్చి పాత అధికారుల నెంబర్లకే ఫోన్ చేస్తుండగా వారు మేం బదిలీ అయ్యాం..మాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారని చీదరించుకుంటున్న పరిస్థితి ఉంది. మండలంలోని వెల్మినేడు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేండ్ల క్రితం వైద్యులు, సిబ్బంది బదిలీ అయినా సమాచార హక్కు చట్టం బోర్డులో మాత్రం నేటికీ వారి పేర్లే ఉన్నాయి. రెండేండ్లక్రితం డాక్టర్ సుధీర్ప్రసాద్ ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిపోయారు. ఆయన పేరు నేటికీ బోర్డుగా అలాగే ఉంది. సుజాత (పీఎన్ఎం) కూడా హైదరాబాద్కు బదిలీపై వెళ్లి పోయారు. ఆమె పేరు కూడా బోర్డు మీద అలాగే ఉంది. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఆస్పత్రికి వచ్చి బోర్డుపై ఉన్న నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. మేం ఇక్కడ డ్యూటీ చేయడం లేదు..మళ్లీ ఫోన్ చేయొద్దని వారు దబాయిస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమాచార హక్కు చట్టంపై ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పేర్లు అప్డేట్ చేయాలని రోగులు కోరుతున్నారు.