Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన అధికారులు
- 20 వార్డులు, బరిలో 93 మంది అభ్యర్థులు
- మొత్తం ఓటర్లు 21,382
- 40 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి : పోలీసులు
నవతెలంగాణ -నకిరేకల్
నేడు జరిగే నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 21,382 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,537 మంది పురుష ఓటర్లు ఉండగా 10,845 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ నిర్వహణకు పట్టణంలో 40 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి ఓటరుకు మాస్కు తప్పని సరి చేశారు. మాస్కు ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి వచ్చేలా కఠినంగా నిబంధనలు పెట్టారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా 300 మంది సిబ్బంది, 400 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను గురువారం అందజేశారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరుస్తారు. మే 3న కౌంటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు. వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేలా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ శామియాణా లు, తాగు నీరు, విద్యుత్ సదుపాయం కల్పించారు.
పోలింగ్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ
నకిరేకల్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నిక బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి కరోనా నివారణా చర్యల్లో భాగంగా 400 శానిటైజర్లు, 800 మాస్కులు, 100 ముఖ కవచా లను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.