Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మునుగోడు
- మహిళా సంఘాలకు అందని పావలా వడ్డీ
- మునుగోడు మండలానికి రావాల్సింది రూ.8,77,84,550
మహిళలను సామాజికంగా, ఆర్థికంగా చైతన్యం చేయడం, వారి కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాలు ఎంతగానో దోహద పడుతున్నాయి. అయితే కొన్నేండ్లుగా ప్రభుత్వం ఈ సంఘాల పట్ల శ్రద్ధ పెట్టడం లేదు. సంఘం సభ్యులకు మూడేండ్లుగా వడ్డీ అందడం లేదు. దీంతో తాము సంఘాలు పెట్టుకుని ఏం లాభమని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
మునుగోడు మండలంలో మొత్తం 1101 సంఘా లున్నాయి. ఇందులో 12036
మూడేండ్లుగా..మంది వరకూ సభ్యులుగా ఉన్నారు. వీరికి రొటేషన్ పద్ధతిలో రుణాలందజేస్తారు. ఇలా మూడేండ్లుగా ప్రభుత్వం నిర్దేశించిన రుణాలు తీసుకున్న సభ్యులంతా తిరిగి చెల్లించారు. సభ్యులు చెల్లించిన డబ్బులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ డబ్బులు మూడేండ్లుగా ఆగి పోయాయి. ఇలా మండలానికి రూ.8,77,84,550 రావాల్సి ఉంది ఈ ఆర్థిక సంవత్సరానికి రుణం పొందేందుకు 885 సంఘాలకు రూ.28 కోట్లా 45 లక్షలా 34 వేలు అందజేశారు. మండల వ్యాప్తంగా మహిళలు శ్రీనిధి స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించినా ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ అందని ద్రాక్షలా మారిందని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వడ్డీ అందని ద్రాక్షలా మారింది
పోలగోని విజయలక్ష్మిసైదులుగౌడ్ - ఊకొండి ఎంపీటీసీ
మూడేండ్ల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం అందని ద్రాక్షలా మారడంతో మహిళా సంఘం సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో గొప్పలు చెప్పడం తప్ప అమలు చేసిందేమీ లేదు.
మహిళా సంఘాలకు వడ్డీ అందంచాలి
జాజుల పారిజాతసత్యనారాయణగౌడ్ - కోతులారం సర్పంచ్
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ డబ్బులు అందించని స్థాయికి దిగజారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణం అందించి మహిళలను ప్రోత్సహించారు. మహిళలను విస్మరించడం సరికాదు.
అందని వడ్డీ లేని రుణం డబ్బులు
వట్టికోటి అలివేలు - సాయి సంఘం 2వ లీడర్ మునుగోడు
సాయి సంఘం పేరుతో రెండు సార్లు రుణాలు తీసుకొని ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ మూడేండ్లుగా రావడం లేదు. ప్రభుత్వం స్పందించి రుణాలు విడుదల చేయాలి. ఆ డబ్బులతో కుటుంబ పోషణ భారం కొంచం తగ్గుతుంది.
త్వరగా అందజేయాలి...
బాలగోని పద్మ - కిష్టాపురం మహిళా సంఘం సభ్యురాలు
మూడేండ్లుగా వడ్డీ డబ్బులు రాలేదు. తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించాం. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెబుతుంది కానీ..వడ్డీ డబ్బులు విడుదల చేయడం లేదు. కరోనా సమయంలో వడ్డీ డబ్బులు వేస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది.
ప్రభుత్వానికి నివేదిక పంపించాం...శ్రీదేవి - ఏపీఎం
స్వయం సహాయక సంఘం సభ్యులు చెల్లించిన డబ్బులకు వడ్డీ డబ్బులు రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే మహిళా సంఘాల అకౌంట్లో వడ్డీ డబ్బులు జమ చేస్తాం. ఈ ఏడాది ఇప్పటికే మండలంలో 850 సంఘాలకు రూ.28 కోట్లా 45 లక్షలా 34 వేల కొత్త రుణాలను పంపిణీ చేశాం.