Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు ధాన్యం తరలింపు
సివిల్ సప్లరు డీఎం గోపీకష్ణ
నవతెలంగాణ- మోత్కూర్
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ సమస్య లేదని, అవసరమైన లారీలు, డీసీఎంలు అందుబాటులో ఉన్నాయని సివిల్ సప్లరు యాదాద్రి డీఎం గోపికృష్ణ అన్నారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని రైస్ మిల్లులను శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం లోడ్ల వాహనాలను మిల్లుల వద్ద ఎక్కువ సేపు నిలుపుకోకుండా దిగుమతి చేసుకోవాలని సూచించారు. కొర్రీలు పెడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి, మిల్లర్లు, రైతులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్పోర్ట్కు సంబందించి ఎలాంటి ఇబ్బందులూ రానివ్వమని, వీలైనంత తొందరగా లారీలు పంపుతామన్నారు. దత్తప్పగూడెం, అనాజీపురం, జామచెట్లబావి, కొండగడప, రహింఖాన్ పేట సెంటర్లకు పది లారీలు పంపుతామని, మిగతా సెంటర్లకు సోమవారం నుంచి మరో 10 నుంచి 15 లారీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం సింగిల్ విండో, ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని ధాన్యం అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ యాదయ్య, సంఘం సీఈవో కె.వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.