Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోత్కూరు
మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ ఉప సర్పంచ్ కప్పె వెంకన్నపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామ ఉపసర్పంచ్ కప్పె వెంకన్న తమ్ముడు చంద్రశేఖర్ రెండేండ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య పావని, కూతురు ఉన్నారు. కాగా చంద్రశేఖర్ భార్య పావని గుంటూరుకు చెందిన వ్యక్తిని పెండ్లి చేసుకుని వెళ్లిపోగా, కూతురును వెంకన్న, ఆయన తల్లి తమ వద్దే ఉంచుకుని పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పావని తమ్ముడు దెందె జగదీష్ మేనకోడలును తీసుకెళ్లడానికి శుక్రవారం పొడిచేడు గ్రామానికి వచ్చాడు. 'పావని మరో వ్యక్తిని పెండ్లి చేసుకుని వెళ్లిపోయిందని, పాపను నీకెలా ఇస్తామని, నా తమ్ముని బిడ్డ నావద్దే ఉంటుంది' అని ఉప సర్పంచ్ వెంకన్న తెలిపారు. ఈ విషయంపై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పాత కక్షలు, గొడవతో రగిలిపోయిన జగదీష్ తన బంధువులతో పాటు మరికొంత మందికి ఫోన్ చేసి పొడిచేడు పిలిపించాడు. జగదీష్ బంధువులైన దెందె లింగయ్య, సతీష్‌తో పాటు మరికొంతమంది ఉపసర్పంచ్ వెంకన్నపై దాడి చేశారు. కత్తితో కడుపులో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వెంకన్నను చికిత్స కోసం నల్లగొండలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కత్తితో పొడిచిన వ్యక్తి పరారీలో ఉండగా, దాడికి పాల్పడిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై జి.ఉదరు కిరణ్ తెలిపారు.