Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు డిమాండ్
నవతెలంగాణ - భువనగిరి రూరల్
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఉన్న రైతు వేదికలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా బాధితులందరికీ వైద్యం అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా డిమాండ్ చేశారు. కరోనా సహాయక చర్యలను వేగవంతం చేయాలని, వ్యవసాయ కార్మికులు, పేదలను ఆదుకోవాలని కోరుతూ ఆసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ కరోనా బారిన పడ్డ ప్రజలకు వైద్యం అందించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కరోనా వచ్చి ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే సరైన వైద్యం అందడం లేదన్నారు. దీంతో బాధితులు ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.లక్షలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వైరస్‌తో పేదలు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వసతులు కల్పించి అందరికీ సరైన వైద్యం అందించాలని కోరారు. ప్రతి గ్రామపంచాయతీలోనూ కరోనా టెస్టులు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని కోరారు.
మండల పరిధిలోని బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిలుకమారి గణేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, మండల నాయకులు మధ్యపురం బాల్ నర్సింహ, ఉడత వెంకటేష్, నరాల చంద్రయ్య, కొండ లక్ష్మయ్య, కొండాపురం శ్రీను, మోలుగు నాగరాజు, కొండాపురం ప్రభాకర్, కొండాపురం నర్సింహా, ఉడుత రాఘవులు, మచ్చ బిక్షపతి, అన్నంపట్ల మొగులయ్య, ఆకారం లక్ష్మయ్య, కొండ పాండు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : మున్సిపాలిటీ పరిధిలో ఉపాధిహామీ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం పట్టణ నాయకులు పగడాల శివ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న రైతు వేదికలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక పోవడంతో పేదలు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు గడ్డం వెంకటేష్, దుబ్బాక జగన్, శ్రీశైలంయాదవ్ ఉన్నారు.
మోత్కూర్ : కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు నెలకు రూ.7500, ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ఆరు నెలల పాటు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డికి వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని 200 రోజులకు పెంచి కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్.రాములమ్మ, కె.నర్సింహా, ఎం.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్ : కరోనా కష్ట సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బండారు శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపి మాట్లాడారు. దేశవ్యాప్తంగా రోగులకు సరిపడా ఆక్సిజన్, వ్యాక్సిన్ లేక పోవడంతో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి టంటం వెంకటేశ్, నాయకులు గాడి శ్రీనివాస్, కందాడి దేవేందర్‌రెడ్డి, ఓవల్దాసు సతీశ్, తెలకలపల్లి నర్సింహా పాల్గొన్నారు.