Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైందని, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు శనివారం భువనగిరి జిల్లాకేంద్రంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భువనగిరి మండలంలోని తొక్కపురం గ్రామానికి చెందిన రాసాల శివ శుక్రవారం వ్యవసాయ బావి వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు తాకి మృతిచెందాడు. వైర్లు కిందకు వేళాడుతున్నాయని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారులు స్పందించలేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే శివ మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు ఎంతకు స్పందించకపోవడంతో స్థానిక పట్టణ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని సీఐ కార్యాలయంకు తీసుకెళ్లి అధికారులతో మాట్లాడించారు. ఈ విషయంపై ఆదివారం చర్చిస్తామని అప్పుడు రావాలని కోరడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సుధాకర్, ఏడీఈ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు జనగాం పాండు, ఎంపీటీసీ రసాల మల్లేష్ యాదవ్, నాయకులు నల్లవాస సత్యనారాయణ, మహేందర్ రెడ్డి, జనగాం మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.