Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన 20 వార్డుల ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఆరు స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుపొందారు. మరో రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 20 వార్డులలో పోటీచేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు 11 స్థానాల్లో గెలుపొందారు 14 స్థానాల్లో పోటీ చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఆరు స్థానాల్లో, 16 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 14 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేక పోయారు. ఒకటో వార్డు లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కందాల బిక్షం రెడ్డికి బీజేపీ మద్దతు ఇచ్చింది ఆ అభ్యర్థి గెలుపొందారు. మున్సిపల్ ఫలితాలలో 51 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా 64 నోటాకు నమోదయ్యాయి. 224 ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణించారు.
చతికిలపడ్డ కాంగ్రెస్ - బోణీ కొట్టని బీజేపీ
నకరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ చతికిలపడి 2 స్థానాలకే పరిమితమైంది. 14 స్థానాలలో పోటీ చేసిన బీజేపీ మాత్రం ఒక్క స్థానం కూడా కైవసం చేసుకొని లేకపోయింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి 14 స్థానాలలో పోటీ చేసి 6 స్థానాల్లో విజయం సాధించారు .ప్రతి వార్డులోనూ టీిఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ పడటంతో ఉత్కంఠభరితంగా ఫలితాల లెక్కింపు సాగింది.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం ఎస్పీ ఏవి.రంగనాథ్ ఎన్నికల పరిశీలకులు వాకాటి కరుణ సందర్శించి పరిశీలించారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షలు చేయించుకోని అభ్యర్థులను, సిబ్బందిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేశారు.