Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మెన్‌గా ఎన్నికైన రాచకొండ శ్రీనివాస్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. పట్టణంలో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిశీలించి పరిష్కరించే దిశగా పని చేయాలని మున్సిపల్ చైర్మెన్, పాలకవర్గాన్ని కోరారు. పట్టణంలో డ్రయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఆహ్లాదం కోసం పట్టణంలో పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. పట్టణంలో దశలవారీగా రోడ్ల విస్తరణ చేపడుతున్నట్టు వివరించారు. బస్టాండు, స్టేడియం తదితర ప్రాంతాల్లో పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి
మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్
అందరి సహాయ సహకారాలతో నకిరేకల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని నూతన చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు. పట్టణంలో నెలకొన్న డ్రయినేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ మురారి శెట్టి ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, మేనేజర్ మున్వర్ అలీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.