Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
- రోడ్డు విస్తరణ స్థలాన్ని పరిశీలించిన
- ఆర్అండ్బీ అధికారులు
- నిర్మాణం చేపట్టొద్దంటూ ఆదేశాలు
- అయినా అడ్డదారిలో నిర్మించుకునేందుకు యత్నాలు
- నిర్మాణ అనుమతుల కోసం పంచాయతీకి దరఖాస్తు
నవతెలంగాణ - నల్లగొండ
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణానికి గ్రామపంచాయతీ కార్యదర్శి బుధవారం నోటీసులు జారీ చేశారు. రోడ్డు విస్తరణ కోసం ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికే మార్కింగ్ చేసిన విషయం తెలిసిందే. మార్కింగ్ చేసిన స్ధలంలో ఆ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఒకరు దర్జాగా నిర్మాణాన్ని చేపడుతున్నారు. రాత్రికి రాత్రే పిల్లర్లు లేపారు. విషయం తెలుసుకున్న స్థానికులు పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని మంగళవారం నవతెలంగాణలో కథనం ప్రచూరితమైంది. దీనికి జిల్లా యంత్రాంగం, మండల స్థాయి అధికారులు స్పందించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ అక్రమ నిర్మాణానికి నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నిర్మాణానికి నోటీసులు అంటించారు. ఆర్అండ్బీ ఏఈ కూడా బుధవారం నిర్మాణాన్ని పరిశీలించి రోడ్డు విస్తరణ స్థలంలో ఎలాంటి నిర్మాణమూ చేపట్టొద్దని ఆదేశాలుజారీ చేశారు. ఒక వేళ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పథకం మార్చిన వార్డు సభ్యుడు
రోడ్డు విస్తరణ స్థలంలో ఇంటి నిర్మాణానికి పూనుకుంటున్న వార్డు సభ్యుడు అధికారుల నుంచి నోటీసులు తీసుకున్నాక రూటు మర్చాడు. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పంచాయతీ పాలకవర్గానికి దరఖాస్తు చేసుకున్నాడు. తానొక వార్డు సభ్యుడు కావడం, ఇతర పాలకవర్గ సభ్యులను మచ్చిక చేసుకుని తీర్మానం చేయించుకుని అనుమతి పొందాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసినా భవననిర్మాణానికి అనువుతులు జారీ చేయాల్సింది ఎంపీడీవోనే అన్న విషయం సదరు వార్డు సభ్యునికి బహుశా తెలియక పోవచ్చు. మరి ఆయన అక్రమ కట్టడానికి పాలక వర్గం తీర్మానం చేస్తుందా...దానికి ఎంపీడీవో అనుమతి ఇస్తారా అన్నది చూడాల్సింది.