Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24/7 కేంద్రాలకు సరిపడా ఆక్సిజన్
- కోవిడ్‌కు మందు ధైర్యమే
- రేమిడిసీవర్ కొరత లేకుండా ఏర్పాట్లు
- అవసరమున్న చోట ఆపొద్దు
- అక్కెరలేని చోట వాడొద్దు
మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఐసోలేషన్ సెంటర్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికారులకు సూచించారు. 24/7 నడిచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా ఆక్షిజన్ సరఫరా చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో కోవిడ్-19పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, డీఐజీ ఏ.వీ రంగనాధ్, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్య శాఖాధికారి కొండల్రావు, జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ జైసింగ్ రాథోడ్, డీసీహెచ్ డాక్టర్ మాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 24-7 నడిచే 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. అందులో చండూరు, చిట్యాల, కనగల్, కేతేపల్లి, మునుగోడు, శాలిగౌరారం, తిప్పర్తి, దామరచర్ల, హాలియా, నిడమనూర్, పెద్దవూర, వేములపల్లితో పాటు డిండి, గుడిపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏపల్లి తదితర మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇకపై కోవిడ్ పేషంట్లకు ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మంజూరైన రేమిడిసీవర్ ఇంజెక్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మెడిసిన్ ఇండెంట్ పెట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు సూచించారు.జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అన్ని వెంటిలేటర్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ పేషంట్లకు ధైర్యమే మందు అని, ఆ ధైర్యమే వైద్యులు, వైద్యశాఖ సిబ్బంది పేషేంట్లకు అందించాలని సూచించారు. మనోధైర్యానికి మించిన మందు లేదన్న సందేశం ప్రజల్లోకి పంప గలిగితే కోవిడ్ పేషేంట్లను కాపాడుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 4,50,895 శాంపిల్స్ సేకరించగా 40,696 మందికి పాజిటివ్ వచ్చినట్టు గుర్తించినట్టు వివరించారు. అందులో 10,290 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా 703 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. జిల్లాలో 1400 టీంలను ఏర్పాటు చేసి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 72.64 శాతం రికవరీ ఉందని, 29,560 మంది పూర్తిగా కొలుకున్నారన్నారు. మొత్తం పాపులేషన్లో 25.87 శాతం టెస్ట్‌లు చేయగా 9.03 శాతం పాజిటివ్‌గా నమోదు అవుతున్నారన్నారు. రేమిడిసీవర్ పేరుతో ఎక్కువ మొత్తం వసూలు చేస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని రావాలన్నారు.