Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంగపల్లి పాలకవర్గం వేడుకోలు
నవతెలంగాణ-యాదాద్రి
'మా గ్రామ చెరువును కాపాడండి...మా ఊరికి జీవనాధారమైన నల్ల చెరువును రియల్ వ్యాపారుల నుండి రక్షించండి' అని అంటూ యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పాలకవర్గ సభ్యులు వేడుకుంటున్నారు. విశాలమైన చెరువును హైదారాబాద్-వరంగల్ హైవే నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ, అలాగే రియల్టర్లు కుమ్మక్కై పూర్తిగా ధ్వంసం చేయడానికి కుట్ర చేస్తున్నారని యాదాద్రిభువనగిరి జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రేపాక స్వామితో పాటు వార్డు సభ్యులు బండి మహేష్, బెల్లకొండ ఆంజనేయులు, ఎడపల్లి వెంకటేశ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గంలోని అధికార పార్టీ సభ్యులు కూడా ఇలా ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరమనిపిస్తోంది. అధికార పక్ష సభ్యులు ఏది చెబితే అది..ఎంత చెబితే అంతా..ఉండాలి కదా ఇక్కడ సీన్ రివర్స్‌గా ఉందని పలువురు ఎద్దెవా చేస్తున్నారు. మండలంలోని వంగపల్లి నల్ల చెరువు రికార్డుల ప్రకారం 402,404,405,406 సర్వే నంబర్లల్లో 66ఎకరాలు ఉంది. ఈ చెరువు నైజాం కాలం నాటిది. తెలంగాణ ప్రభుత్వం 40లక్షలు వెచ్చించి ఈ చెరువుకు మరమ్మత్తులు కూడా చేయించింది. రియల్ వ్యాపారానికి అనువుగా ఉన్న ఇక్కడి భూమిపై రియల్ వ్యాపారుల కన్ను పడింది. గతంలో ఈ చెరువులోని కొన్ని తుమ్మ చెట్లను రియల్టర్లు ద్వంసం చేశారు. ఇది గమనించి గ్రామస్థులు అటవిశాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయగా లక్షల్లో ఫైన్ కట్టి తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా ఎల్ అండ్ టీ సంస్థ జాతీయ రహదారి నిర్మాణం కోసం ఇష్టారీతిన కాలువలో మట్టిని తవ్వి చెరువులోకి నీరు రాకుండా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై పాలకవర్గం అభ్యంతరం చెప్పిన ఆ సంస్థ బేఖాతర్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలోని నీరు పక్కదారి పట్టిస్తోన్న ఎల్ అండ్ టీ సంస్థ, కబ్జాకు పాల్పడుతోన్న రియల్టర్లపై ఆఫీసర్లు జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలని సభ్యులు కోరుతున్నారు. ఆ చెరువే జీవనాధారంగా బతికే బెస్త కులం అభివృద్ధికి, జీవాలకు మేతను ఇచ్చే తుమ్మలను రక్షించి గొల్ల కుర్మల అభ్యున్నితి తోడ్పడాలని పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.