Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్మిక వ్యతిరేక విధానాలకు పాలకులు ముగింపు పలకాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేశ్ అన్నారు. సీఐటీయూ 51వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ 30 మే 1970న ఆవిర్భవించి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాడుతుందన్నారు. రెండోసారి అధికారంలోకొచ్చాక మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు హరించడం కోసం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు వారికి దారాధత్తం చేస్తుందన్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టడానికి దేశవ్యాప్త కార్మికోద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన ఆవశ్యకత కార్మికలోకం ముందుందని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రోజురోజుకూ తీవ్రతరం చేస్తున్న కేంద్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలున్నాయని, కార్మికులు వారి హక్కుల కోసం సమ్మెలు చేస్తే కార్మికుల మధ్య విచ్ఛిన్నతకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన కుట్రలను కార్మిక లోకం ఆర్టీసీ, సఫాయి కార్మికుల సమ్మె సమయంలో చూసిందని, కార్మికుల వ్యతిరేక విధానాలు అవలంబించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, ఉపాధ్యక్షులు పతాని శ్రీను, బజార్ ముఠా హమాలీ మేస్త్రీ శ్రీను, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.
సంఘటితఉద్యమాలే కార్మికసమస్యలకు పరిష్కారం
సూర్యాపేట : కార్మికుల సంఘటితఉద్యమాలే పాలకవర్గాల దోపిడీని ఎదుర్కొంటాయని, అందుకు ఐక్య పోరాటాల నిర్మాణం కోసమే సీఐటీయూ విరాజిల్లిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావురావు అన్నారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంఘం కార్యాలయంలో ఆయన జెండాను ఎగురవేసి మాట్లాడారు.వందేండ్ల కార్మిక పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ వర్గపోరాటమే ఊపిరిగా సీఐటీయూ ముందుకు సాగుతుందన్నారు.నేడు పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలు నిర్వహించడంలో తమ సంఘం ముందుందన్నారు.నేడు కేంద్రంలోని మోడీ సర్కారు టోకుగాను,చిల్లరగాను ప్రభుత్వ రంగ పరిశ్రమలను స్వదేశీ,విదేశీ బహుళజాతి సంస్థలకు అమ్మేస్తుందని విమర్శించారు.పార్లమెంటు సంప్రదాయాలను కాలరాసిన బీజేపీ ప్రభుత్వం కార్మికులు త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగుకోడ్లుగా కుదించి కార్మికులను బానిసత్వంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో వల్లపుదాసు సాయికుమార్,మామిడి సుందరయ్య, కోటగోపి, ఎల్గూరి గోవిందు, లక్ష్మయ్య పాల్గొన్నారు.