Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ మాజీచైర్మన్ బర్రె జహంగీర్
- బైకులకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసన
నవతెలంగాణ - భువనగిరి
దేశ చరిత్రలో ఎప్పడు లేని విధంగా పెట్రోల్, డీజిల్ , వంట నూనె, నిత్యావసర సరుకులు పెంచి పేద మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితికి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లు పూర్తి చేసుకున్నందుకు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద మోటార్ సైకిళ్లకు ,ఆటోలకు తాడు కట్టి లాగుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఏడేండ్లపాలనలో పేద ప్రజలకు, సామాన్యులకు, మధ్యతరగతి ప్రజానీకానికి ఎలాంటి లాభం ఒనగూరలేదన్నారు. కార్పొరేటర్లకు, పెట్టుబడిదారులకు దేశ ఆర్థిక వ్యవస్థను కట్టబెట్టారన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి జీతాలు పెరగట్లేదన్నారు. కూలి పని చేసేవాడికి పని దొరకట్లేదన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పేద మధ్యతరగతి కుటుంబాల, కుటీర మధ్య తరహా పరిశ్రమల ఆదాయం తగ్గుతూ ఉంటే. అదానీ సంపద 750 శాతం, అంబానీ సంపద350 శాతం పెరిగిందన్నారు. దేశ సంపద మాత్రం -23 (మైనస్ 23) కి పడిపోయిందన్నారు. విపత్కర సమయంలో పేదవారికి నెలకు రూ. 7500 ఇవ్వాలని, కరోనా బారినపడి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పడిగెల ప్రదీప్,యూత్ కాంగ్రెస్ నాయకులు బట్టు మహేందర్, కసరబోయిన సాయి, గాయపాక వెంకటేష్,కబీర్,బర్రె మహేందర్,ఫయాజ్,గుడ్డెంకి ప్రమోద్, మధు బాబు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.