Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లులక్ష్మీ
నవతెలంగాణ-సూర్యాపేట
బ్లాక్‌ఫంగస్ బాధితులకు ఉచిత వైద్యం అందించి ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.రాష్ట్రంలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ వేగంగా విస్తరిస్తుందన్నారు.బెడ్లు,మందులు,డాక్టర్లు,వైద్య సిబ్బంది తగిన సంఖ్యలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ వ్యాధికి గురైన వందలాది మంది బాధితులు స్థానికంగా పరీక్షలు చేయించుకుని వైద్యానికి హైదరాబాద్ వస్తున్నారన్నారు.ఈ వైద్యానికి ప్రధాన ఆస్పత్రిగా ఉన్న కోఠి ఈఎన్టీకి రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తున్నారని వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.రోజుల తరబడి ఆస్పత్రిలో పడిగాపులు పడుతున్నా బెడ్లు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చనిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.మందులు,ఇంజెక్షన్లు బ్లాక్‌లో అమ్ముతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మందులనూ ప్రయివేటు మెడికల్ దుకాణాల్లో తేవాలని రాయడంతో బాధితులు రూ.25 వేల నుంచి రూ.30 వేలు చెల్లించాల్సి వస్తున్నదని వివరించారు. యాంటీ ఫంగస్ మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు.దీనిపైనా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.కరోనా మాదిరిగా బ్లాక్ ఫంగస్‌కూ ప్రయివేటు ఆస్పత్రులకు వరంగా మారిందన్నారు. బాధితులు రూ.లక్షల్లో వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారన్నారు. ఈఎన్టీ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను వైద్య సిబ్బందిని తగిన సంఖ్యలో పెంచాలని అన్నారు.టిమ్స్ మాదిరిగా తాత్కాలికంగానైనా ప్రత్యేక భవనాన్ని బ్లాక్‌ఫంగస్ కోసం వినియోగించాలని కోరారు.బ్లాక్‌ఫంగస్‌కు గురైన ప్రతి బాధితుడికీ వెంటనే ఆస్పత్రిలో బెడ్ ఇచ్చి ఉచిత వైద్యంఅందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వమే అన్ని రకాల మందులనూ ఉచితంగా సమకూర్చి ప్రతి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ పరీక్షలు విస్తతంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో ఉన్న ప్రయివేటు ఈఎన్టీ డాక్టర్లను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలని సూచించారు.ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం ప్రభుత్వ పర్యవేక్షణలో చర్యలు చేపట్టా లన్నారు.బ్లాక్ ఫంగస్‌ను అరికట్టడానికి ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ లేదా ప్రయివేటు ఆస్పత్రిలోనైనా బ్లాక్‌ఫంగస్‌కు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.వైద్యులకు వేతనాలు పెంచాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, మట్టిపెళ్లి సైదులు, కోటగోపి, జిల్లపల్లి నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్, నాయకులు చిన్నపంగ నర్సయ్య, నల్లమేకల అంజయ్య పాల్గొన్నారు.