Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్
నవతెలంగాణ-నాంపల్లి
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతిధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, మార్కెట్ యార్డును ఆయన సందర్శించారు. మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో ధాన్యం రాశులను పరిశీలించారు. కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.రైతులతో మాట్లాడారు.మూడురోజుల పాటు రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని తహసీల్దార్, పీఏసీఎస్ చైర్మెన్, వ్యవసాయ విస్తరణాధికారిని ఆదేశించారు.వర్షం వస్తే ధాన్యం తడుస్తుందన్నారు.కాబట్టి మార్కెట్‌యార్డు గోదాంలో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేయాలన్నారు.ఇప్పటివరకు జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్‌యార్డులలో 375 కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.ఇప్పటివరకు కొనుగోలు చేసిన రైతులకు రూ.1000 కోట్లు చెల్లించామన్నారు.ఇంకా జిల్లావ్యాప్తంగా కొనుగోలుకేంద్రాలలో 20 వేల నుండి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. కొనుగోలుకేంద్రాలలో మిగిలిన ధాన్యాన్ని మూడురోజుల్లో కొనుగోలు చేసేలాచర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.వరికోతలు ఆలస్యం కావడం ,మిల్లులు టన్నేజీ సామర్థ్యం మించి ధాన్యం రావడం,అకాలవర్షాలు రావడంతో ధాన్యం తరలింపు కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యమైందన్నారు.మిల్లులలో నిల్వకు ఖాళీ లేక మార్కెట్ యార్డ్,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలలో, ఫంక్షన్‌హాళ్లు తీసుకుని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి ప్రసాద్, జిల్లా సరఫరాల శాఖ డీఎం నాగేశ్వర్రావు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం,తహసీల్దార్ లాల్‌బహుదూర్, ఏఈఓలు కవిత, అనూష, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ గట్టుపల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు.