Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మోత్కూర్
ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో మొద్దునిద్ర వీడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి అన్నారు. శనివారం మోత్కూర్ వ్యవసాయ మార్కెట్‌ను వారు సందర్శించారు. వర్షాలకు తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ఆలస్యం కావడం పట్ల మార్కెట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులు తడిసి మొలకెత్తుతున్నాయని, అధికారులు, రైస్ మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఏ గ్రేడ్ ధాన్యంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూడాలన్నారు. తూకం వేసిన బస్తాలు ఎగుమతి చేసేందుకు లారీల యజమానులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, అధికారులు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ కార్యదర్శులు గుండు వెంకటనర్సు, కూరెళ్ల రాములు, నాయకులు కూరెళ్ల పక్కిర్, పంగ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.