Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత నెలతో ముగిసిన పాలకవర్గం పదవీకాలం
- ఓసీ జనరల్ రిజర్వు కానున్న చైర్మెన్ పదవి
- చైర్మెన్ పదవికి పోటీ పడుతున్న ఆశావహులు
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం గత నెలతో ముగియడంతో మార్కెట్ చైర్మెన్ పదవి ఎవరిని వరిస్తుందోనని అధికార టీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ప్రస్తుత పాలకవర్గం 2019 డిసెంబర్ లో నియామకం కాగా చైర్మెన్‌గా కోనేటి స్వాతి, వైస్ చైర్మన్ గా కొణతం యాకూబ్ రెడ్డి, డైరెక్టర్లుగా గజ్జెల్లి శంకరయ్య, పొన్నగాని జయశ్రీ, బూరెడ్డి రవీందర్ రెడ్డి, పసుల నాగరాజు, మిరియాల కుమారస్వామి, పూలపల్లి జనార్దన్ రెడ్డి, మిట్టపల్లి నగేష్, బుస్సా రవి నియమితులయ్యారు. కాగా పాలకవర్గం ఏడాది పదవీకాలం 2020 నవంబర్‌లో ముగియడంతో ప్రభుత్వం పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. దీంతో మే 27తో పొడిగించిన పదవీకాలం కూడా పూర్తి కావడంతో మార్కెట్ కార్యదర్శి ఎదుళ్ల వెంకటేశ్వర్ రెడ్డి తదుపరి పాలకవర్గం నియామకం కోసం మార్కెటింగ్ జిల్లా మేనేజర్, డిప్యూటీ డీఎం, జాయింట్ డైరెక్టర్లకు నివేదిక పంపారు.
ఓసీ జనరల్ రిజర్వు కానున్న చైర్మెన్ పదవి
రిజర్వేషన్ల రోస్టర్ లో భాగంగా మార్కెట్ చైర్మెన్ పదవి ఈసారి ఓసీ జనరల్ గా రిజర్వు కానుంది. మార్కెట్ పదవులు నామినేటెడ్ పదవులు అయినప్పటికీ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో 2017లో ఎస్సీ జనరల్, 2019లో ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ మార్కెట్ పరిధిలో మోత్కూర్, అడ్డగూడూర్, గుండాల, ఆత్మకూర్ ఎం మండలాలతో పాటు మోటకొండూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్ రెడ్డి నియోజకవర్గాల్లో ఈ మార్కెట్ ఉండగా, మార్కెట్ పరిధిలోని మండలాల్లో మోత్కూర్, అడ్డగూడూర్ తుంగతుర్తిలో, గుండాల, ఆత్మకూర్(ఎం), మోట కొండూరు మండలాలు ఆలేరులో ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేల ఆశీస్సులు, పార్టీ విధేయులకే చైర్మెన్ పదవి దక్కే ఛాÛన్స్ ఉంది.
చైర్మెన్ పదవికి పోటీ పడుతున్న ఆశావహులు
రెండు టర్మ్‌ల తర్వాత మార్కెట్ చైర్మెన్ పదవి ఓసి జనరల్ అవుతుండడంతో చైర్మెన్ పదవి కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. 2017లో ఎస్సీ జనరల్ రిజర్వ్ కావడంతో అడ్డగూడూరు మండలానికి చెందిన చిప్పలపల్లి మహేందర్ నాథ్‌కు చైర్మెన్ పదవి దక్కగా, 2019లో ఎస్టీ మహిళలకు రిజర్వు కావడంతో ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన కోనేటి స్వాతికి చైర్మెన్‌్, మోత్కూర్‌కు చెందిన టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కొణతం యాకుబ్ రెడ్డికి వైస్ చైర్మెన్ పదవులు దక్కాయి. ఈసారి జనరల్ రిజర్వ్ అవుతుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న మాజీ వైస్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డికి తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ చైర్మెన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రెండు టర్మ్‌ల్లో మోత్కూర్, అడ్డగూడూర్, ఆత్మకూర్(ఎం) మండలాలకు ప్రాతినిధ్యం లభించడంతో ఈసారి గుండాల మండలానికి అవకాశం ఇవ్వాలని ఆ మండల నాయకులు పలువురు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. గుండాలకు చెందిన మార్కెట్ మాజీ చైర్మెన్, మాజీ జెడ్పీటీసీ మందడి రామకష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు బండ రమేష్ రెడ్డి, ఇమ్మడి దశరధ, చందం ప్రకాష్, ఉమ్మడి నల్లగొండ జడ్పీ మాజీ చైర్మెన్ గడ్డమీది పాండరి పేర్లు వినపడుతున్నా అందులో ప్రముఖంగా మందడి రామకష్ణారెడ్డి పేరు వినిపిస్తోంది. రామక్రిష్ణారెడ్డికి ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు అటు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో మంచి పరిచయాలు ఉన్నాయి. చైర్మెన్ పదవి కోసం ఆయన కూడా గట్టి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆత్మకూరు మండలానికి చెందిన దూదిపాల రవీందర్ రెడ్డి, యాస ఇంద్రారెడ్డి, కోరె బిక్షపతి కూడా ఆశావహుల లిస్టులో ఉన్నారు. తాజాగా మోత్కూర్ మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, కాంట్రాక్టర్, జడ్పీటీసీ భర్త గోరుపల్లి సంతోష్ రెడ్డి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చైర్మెన్ పదవి కాలం కూడా రెండేళ్లకు పెరిగే అవకాశం ఉండటంతో ఎవరెవరు ఏయే ప్రయత్నాలు చేసి చైర్మెన్పదవి దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.