Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
తెలుగు కథా సాహిత్యంలో శిఖరాయమాన స్థాయికి చేరుకున్న కాళీపట్నం రామారావు సంస్మరణ సభను సోమవారం జూమ్ యాప్ ద్వారా నల్లగొండ కథా పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కా.రా చిత్ర పటానికి పలువురు కవులు, రచయితలు నివాళులర్పించారు. సంస్థ కన్వీనర్ పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త వేణు సంకోజు మాట్లాడుతూ సాహిత్యంలో కథకు శాశ్వతత్వంతో గొప్ప స్థానం కల్పించిన వ్యక్తి కా.రా అని అన్నారు. ఆయన సాహిత్యాన్ని నేటి తరం రచయితలు అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ కా.రా మాస్టారు తెలుగు కథా సాహిత్యం ఎదిగేందుకు గొప్ప ప్రయత్నం చేశారన్నారు. డాక్టర్ ఎస్.రఘు మాట్లాడుతూ కా.రా మాస్టారు కాలక్షేపం కథలు రాయలేదని చైతన్యంతో సమాజంలోని వైరుధ్యాలను చిత్రించారని, అంతే కాకుండా సామాజిక మార్పుకు దోహదపడే కథలు అందించారని తెలిపారు. కథా రచయిత్రి వురిమళ్ల సునంద మాట్లాడుతూ కా.రా చేసిన కృషి ఖండాంతరాలకు వ్యాపించిందన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా డా.మండల స్వామి, సాగర్ల సత్తయ్య వ్యవహరించారు. డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డా.పోరెడ్డి రంగయ్య, ఉప్పల పద్మ, శీలం భద్రయ్య, ఎం.జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.