Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగించింది. అయితే సడలింపు సమయాన్ని పెంచింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఇచ్చారు. మరో గంట ప్రజలు ఇండ్లకు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ అదుపులోకి రాని కొన్ని నియోజకవర్గాలలో ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరిగానే లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు సడలింపు ఇచ్చి ఆ తర్వాత లాక్‌డౌన్‌ను సీరియస్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. అందులో నల్లగొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్నట్టుగానే లాక్డౌన్ కొనసాగనుంది. కరోనా కేసుల నమోదు తగ్గకపోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో నల్లగొండ నియోజకవర్గం, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాలలో ఈ పరిస్థితి ఉంటుందని ప్రకటించారు. కేవలం నకిరేకల్ నియోజకవర్గంలోనే కేసులు అదుపులో ఉండడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారనే ప్రచారం జరిగింది. ఒకదశలో పాఠశాలలు కూడా తెరుస్తారనే అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. అయితే ఉద్యోగులకు పిఆర్సీకి సంబంధించిన జీవో వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు కూడా ఉద్యోగులకు నిరాశే మిగిలింది. కానీ ఆర్ధిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మూడు నెలల వరకు తాత్కాలికంగా పీఆర్సీ అమలును వాయిదా వేసినట్టు తెలిసింది.జిల్లా వ్యాప్తంగా ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల మంజూరుకు ప్రభుత్వం తెరలేపింది. 15 రోజుల్లో దరఖాస్తుదారులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసారైనా ఈకార్డులకు మోక్షం కలుగుతుందో లేదా చూడాలి మరి.