Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మునుగోడు
సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని కాజేసేందుకు యత్నించిన సర్పంచ్ భర్త, ఆయనకు సహకరించిన మరి కొందర్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం..మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన శ్రీరామోజు మదనాచారి భార్య ధనమ్మకు అదే గ్రామంలో సర్వే నెంబర్ 282/6లో 3.36 ఎకరాల భూమి ఉంది. ఆమె వద్ద ఆ గ్రామ సర్పంచ్ భర్త కర్నాటి ఉశయ్య 2015లో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. ఇటీవలే ధనమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఇదే అదునుగా భావించిన సర్పంచ్ భర్త మొత్తం భూమిని కొనుగోలు చేసినట్టు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ధనమ్మ కుమారుడు శంకరాచారి నెల రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై రజినీకర్‌రెడ్డి సర్పంచ్ భర్త ఉశయ్యపై కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం ఈ భూమి తనదే అంటూ సర్పంచ్ భర్త భూమి మీదికి వెళ్లి సేద్యం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితుడు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సర్పంచ్ భర్తతో పాటు మరో ఐదుగురురి సంతకాలను సేకరించి ఫోరెన్సిస్ ల్యాబ్‌కు తరలించారు. ఫోరెన్సిస్ ల్యాబ్‌లో సంతకాలు ఫోర్జరీ అయినట్టు నిర్ధారణ కావడంతో సర్పంచ్ భర్త కర్నాటి ఉశయ్య, ఆయనకు సహకరించిన దాస్, గౌరీశంకర్, కర్నాటి లింగయ్య, ఐలయ్య, జానకీ రాములును రిమాండ్‌కు తరలించారు.