Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంజూరుకాని డయాగ్నోస్టిక్ సెంటర్
- ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా
- పీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో డయాగ్నోస్టిక్స్ సెంటర్ మంజూరు కాకున్నా టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రచారం చేసుకుంటున్నారని పీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఏరియాస్పత్రిలో ప్రారంభించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఏరియాస్పత్రి ఎదుట నిరసన ధర్నా చేపట్టగా కొందరు టీిఆర్‌ఎస్ లీడర్లు ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందటం కోసం కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని పత్రికా ప్రకటన విడుదల చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 405 తెది 5-7-2018 కాపీలను చూపిస్తూ 2017 -18 సంవత్సరంలో మంజూరు అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్‌ను ప్రతిపాదనలు పంపిన జీవో కాపీలను, రూ. 70 లక్షల రూపాయలతో ఏరియా ఆస్పత్రికి కొన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం పంపిన జీవోకాపీలను టీఆర్ఎస్ నాయకులు చూపిస్తూ భువనగిరి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అతని నిర్లక్ష్యం అసమర్ధత వల్లనే నిన్న సోమవారం రోజు 19 జిల్లా కేంద్రాలలో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఏరియా ఆస్పత్రిలో ప్రారంభించలేదన్నారు. ఇప్పటికైనా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏ తేదీన ప్రారంభిస్తారు బహిరంగ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్,కైరంకొండ వెంకటేష్, నజీమా నస్రీన్ సలావుద్దీన్, కోళ్ల దుర్గాభవాని గంగాధర్, వడిచర్ల శరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకోటి రాము, కబీర్ ఏడుమేకల మహేష్, సాయి, మహేందర్, నర్సింగ్ పాల్గొన్నారు.