Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి, మిర్చి విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
- సమర్థవంతంగా పనిచేసే అధికారులకు రివార్డులు
- డీజీపీ మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ - నల్లగొండ
రాష్ట్రాన్ని కల్తీ విత్తన రహితంగా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా పోలీస్ అధికారులంతా రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నకిలీ విత్తనాల విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి శ్రమ వథా కావడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలకు అండగా, వారికి వెన్నుదన్నుగా నిలవాలని ఇందుకోసం క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావం, నిబద్ధతతో పని చేస్తే రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహితంగా మార్చొచ్చని చెప్పారు. రాబోయే 15 రోజుల పాటు నకిలీ విత్తనాలపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టడం, సరైన సమాచారం సేకరించి వాటి అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకునే అధికారులకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా రివార్డులు అందించనున్నట్టు పేర్కొన్నారు.
డీఐజీ రంగనాధ్ మాట్లాడుతూ గతేడాది నల్లగొండ జిల్లాలో పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంతో పాటు ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో మూడు కేసులు నమోదు చేయడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తనిఖీలు చేపడుతున్నట్టు వివరించారు. నకిలీ పత్తి విత్తనాల్లో ప్రధానంగా కాలం చెల్లిన విత్తనాలు, తిరస్కరించబడిన విత్తనాలను సేకరించి రైతులను మోసం చేస్తున్న విషయంలో ఎక్కువ దృష్టి సారించి నకిలీ విత్తనాలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, రమణారెడ్డి, టాస్క్‌ఫోర్స్ అధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.