Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలోని రైతులకు నకిలీ విత్తనాలు చేరకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని,నకిలీ విత్తనాలతో ఏ ఒక్కరైతుకూ నష్టం కలగకుండా చూడాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.శుక్రవారం ఉమ్మడి నల్లగొండ,మహబూబ్ నగర్ జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.పొలీస్ సిబ్బంది రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.సూర్యాపేట జిల్లా పోలీసులు జిల్లాలో నకిలీ విత్తనం అమ్మే ముఠాల గుట్టురట్టు చేస్తూ నకిలీ విత్తనాలు రైతుల దరిచేరకుండా నిరోధిస్తున్నారని కితాబిచ్చారు.అందుకు కృషి చేసిన పోలీస్‌సిబ్బందిని అభినందించారు.వ్యవసాయం సీజన్ ప్రారంభమైనందున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తుందన్నారు.అనంతరం ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల అమ్మకాలు,సరఫరా జరగకుండా తీసుకుంటున్న చర్యలను, సీజ్ చేసిన నకిలీ విత్తనాల కేసులను,పట్టుబడి చేసిన విధానాన్ని డీజీపీకి వివరించారు.సూర్యాపేట జిల్లాలో గడిచిన వారం రోజుల్లో రూ.14.50 కోట్ల పైచిలుకు విలువ చేసే నకిలీ విత్తనాలను సీజ్ చేసి తమ శాఖ పక్షాన జిల్లా పోలీసులు రైతులకు అండగా నిలిచామని వెల్లడించారు.నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకాలను నిరోధించడానికి సంబంధిత శాఖ అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామన్నారు.గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మే అనుమతిలేని ఏజెంట్లు, సంస్థల నుండి రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.విత్తనాలు అమ్మే వారు ఎవరైనా అనుమానంగా ఉన్నట్టయితే సంబంధిత పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులను మోసం చేస్తే ఎటువంటి వ్యక్తులపైనైనా పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.నకిలీ విత్తనాలు సీజ్ చేసిన అర్వపల్లి, తుంగతుర్తి, చింతలపాలెం, సూర్యాపేట పోలీసు స్టేషన్ల సీఐ, ఎస్సైలు చేపట్టిన కేసుల వివరాలు వివరించారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆయా పోలీసు కార్యాలయాల నుండి డీఎస్పీలు,సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.