Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ తొలితరం కవులు, తెలుగు సాహిత్యంలో విస్మరణకు గురయ్యారని, 40 ఏండ్లకు పైగా ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాల్లో చేర్చకపోవడం ఆనాటి పాలకుల వివక్షకు నిదర్శనమని, ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలని కవి, రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకొని గురువారం రాత్రి సృజన సాహితీ ఆధ్వర్యంలో జూమ్ ఆన్లైన్ వేదికగా సదస్సు నిర్వహించారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతిజ్ఞ జాతీయ ఐక్యతకు ఎంతో తోడ్పడిందన్నారు. ఇందులో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని ఇతర రాష్ట్రాల్లోని పాఠ్యపుస్తకాల్లో ఆయా భాషల్లో ఉన్నందున పైడిమర్రికి జాతీయస్థాయి గుర్తింపు ఇవ్వాలని కోరారు. సాహిత్య పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పైడిమర్రి వెంకట సుబ్బారావు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అని, ఆయా అసెంబ్లీల్లో ఆయన పేరును అన్ని రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లోనూ చేర్చి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చేందుకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపాలన్నారు. నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పైడిమర్రి పేరు పెట్టాలని కోరారు. డాక్టర్ తండు కృష్ణకౌండిన్య మాట్లాడుతూ బహుభాషా కోవిదుడైన పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు ఎలికట్టె శంకర్రావు చేసిన కృషి అభినంద నీయమన్నారు. కవి ఎలికట్టె శంకర్రావు మాట్లాడుతూ భారత జాతిని ఏకీకృతం చేసిన రచన ప్రతిజ్ఞ అని, ట్యాంక్ బండ్పై పైడిమర్రి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు డా.పగడాల నాగేందర్, సాగర్ల సత్తయ్య, డా.మండల స్వామి, పైడిమర్రి వెంకట సుబ్రహ్మణ్యం, పైడిమర్రి రాంబాబు, ఉప్పల పద్మ, చకిలం కవిత, ఎం.జానకిరామ్, గడ్డం శ్రీను పాల్గొన్నారు.