Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నకిలీఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకూ వ్యవసాయ, రుణ ప్రణాళికలు విడుదల చేయలేదన్నారు. రైతులు విత్తనాల కోసం ఆందోళన చెందుతున్నారన్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ రైతులకు అవసరమైన, నాణ్యమైన విత్తనాలు మార్కెట్ కమిటీల ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా అందించాలని కోరారు. ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు పూర్తి సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలన్నారు. రైతులందరికీ కొత్త అప్పులు జూన్ 15లోగా ఇవ్వాలని, స్వేలాఫ్ ఫైనాన్స్ అమలు చేయాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు గొర్ల ఇంద్రారెడ్డి, మల్లు గౌతమ్‌రెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, పి.గోవిందరెడ్డి ఉన్నారు.