Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగకోళ్లు పట్టిన టీచరే..మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన వైనం
- ఆ దొంగ ఓటే మున్సిపల్ ఫలితాలను మార్చిందంటున్న కాంగ్రెస్ లీడర్లు
- 7వ వార్డులో ఒక్క ఓటుతో ఓడిపోయిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి
- న్యాయ పోరాటం చేస్తున్న ఓడిన అభ్యర్థి
- సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
నవతెలంగాణ - మోత్కూర్
దొంగ కోళ్లు...దొంగ ఓట్లు.. ఏంటని అనుకుంటున్నారా.. ఇప్పుడు ఈ ముచ్చట మోత్కూర్ మున్సిపాలిటీలో హాట్ టాపిక్ మారింది. రెండు రోజుల క్రితం దొంగ కోళ్లు పడుతూ దొరికిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మున్సిపల్ ఎన్నికల్లో రెండు ఓట్లు (ఒకటి పోస్టల్ బ్యాలెట్, మరోటి పోలింగ్ కేంద్రంలో) వేయడంతో ఈ ''దొంగ'' వ్యవహారం కాస్తా రాజకీయ చర్చకు దారి తీసింది. ఆ ఒక్క ఓటు మున్సిపల్ ఫలితాలను మార్చి వేసింది. ఆ ఒక్క ఓటుతో ఓడిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఏడాది కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కాపీలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా రచ్చ రచ్చయ్యింది.
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మోత్కూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. 12 వార్డులకు ఎన్నికలు జరగ్గా 2020 జనవరి 25న ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్ఎస్ 6 వార్డులు, కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకోగా 7వ వార్డు ఫలితం టై అయ్యింది. ఆ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిగా తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా బద్దం నాగార్జునరెడ్డి పోటీ చేశారు. ఇద్దరికీ 378 ఓట్లు వచ్చాయి. ఉత్కంఠ ఫలితంలో ఎన్నికల అధికారులు డ్రా తీయగా టీఆర్ఎస్ అభ్యర్థి సావిత్రి మేఘారెడ్డి పేరు వచ్చింది. దీంతో ఆమె విజయం సాధించినట్టు ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, మున్సిపల్ చైర్మెన్‌గా సావిత్రిమేఘారెడ్డి పదవి చేపట్టడం జరిగిపోయింది.
ఎన్నికల ఫలితాలను సమీక్షించుకునే క్రమంలో ఓడిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నాగార్జునరెడ్డి, ఇతర నాయకులు ఆ వార్డులో ప్రభుత్వ టీచర్ చిక్కులపల్లి సునీల్ దొంగ ఓటు వేసినట్టు గుర్తించారు. ఆ ప్రభుత్వ టీచర్‌కు మున్సిపాలీలోని 7వ వార్డులో (సీరియల్ నెంబర్ 314), 8వ వార్డులో (సీరియల్ నెంబర్ 169) రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో ఆ టీచర్‌కు డ్యూటీ పడగా 8వ వార్డులో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశాడు. ఎన్నికల డ్యూటీకి డుమ్మా కొట్టి 7వ వార్డులోని పోలింగ్ బూత్‌లో నేరుగా మరో ఓటు వేశాడు. 8వ వార్డులో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసిన ఆ టీచర్ 7వ వార్డులో ఓటు వేయకుంటే తానే గెలిచేవాడినని, ఆ ఓటుతో మున్సిపల్ ఫలితాలు తారుమారయ్యాయని, ఎన్నికల డ్యూటీకి వెళ్లకుండా మేనేజ్ చేసుకుని టీఆర్ఎస్ అభ్యర్థి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని దొంగ ఓటు వేశాడని కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జునరెడ్డితో పాటు పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.
న్యాయ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి
ప్రభుత్వ టీచర్ సునీల్ వేసిన దొంగ ఓటుతోనే తాను ఓడిపోయానని కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నాగార్జునరెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఫలితాలు వచ్చిన తర్వాత నెల రోజుల్లోగా కేసు ఫైల్ చేయాలని ఉండడంతో 2020 ఫిబ్రవరి 20న నల్లగొండ కోర్టులో కేసు వేశారు. మార్చి మొదటి వారంలో కోర్టు కౌన్సిలర్‌గా గెలుపొందిన సావిత్రిమేఘారెడ్డితో పాటు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, పోలింగ్ బూత్ అధికారులందరికీ నోటీసులు ఇచ్చింది. మార్చి 24న విచారణకు రావాల్సిన ఈ కేసు కరోనా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. నల్లగొండ కోర్టు ఈ కేసును భువనగిరి కోర్టుకు బదిలీ చేసింది. ఇప్పటి వరకు 13 సార్లు విచారణకు వచ్చిన ఈ కేసులో కోర్టు అవకాశం ఇచ్చిన ఐదు వాయిదాల్లోనూ నేటికీ కౌంటర్ ఫైల్ వేయలేదు. కరోనాతో కింది కోర్టులో విచారణ వాయిదా పడుతుండడం, ప్రతివాదులు కౌంటర్ ఫైల్ దాఖలు చేయకపోవడం, మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఫిర్యాదులు వస్తే 8 నెలల్లోగా తేల్చాలని ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జునరెడ్డి హైకోర్టుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దొంగ ఓటు వేసిన ప్రభుత్వ టీచర్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో గానీ ఆ టీచర్ దొంగ కోళ్లు పడుతూ దొరికిపోయి ఓ ఆసక్తికరమైన రాజకీయ చర్చకు తెరలేపాడు. సో...ఇదండీ దొంగ కోళ్లు.. దొంగ ఓట్ల ముచ్చట.