Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు చేయని ధాన్యం
- కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ - నల్లగొండ
అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామని కేంద్రాలకు తెచ్చిన రైతులకు నిరాశే మిగులుతోంది. రోజుల తరబడి వేచి చూస్తున్నా నిర్వాహకులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా అకాల వర్షానికి ధాన్యం తడిచి మొలకలు వచ్చి పూర్తిగా పాడైపోతున్న పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో జిల్లాలో ఇంకా అనేక చోట్ల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో రైతులు ఈ సారి 12 లక్షలా 15 వేల ఎకరాల్లో వరి పంట పండించారు. పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో అధికారులు 386 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు ఇప్పటి వరకు ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షలా 50 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 15 వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లకు వేచి చూస్తోంది.
వెంటాడుతున్న అన్లోడ్ సమస్య
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరతతో పాటు మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ కాకపోవడంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
తడుస్తున్న ధాన్యం
ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లో సుమారు 3 టన్నుల ధాన్యం తడిసి పోయింది. కొన్ని కేంద్రాల్లో ధాన్యం తీసుకొచ్చి రెండు నెలలు దాటినా కొనుగోళ్లకు నోచడం లేదు. వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేక చోట్ల రైతులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని, తడిచిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.