Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడిపించడం చేతగాని తనం
- కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -మునుగోడు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ భూముల అమ్మకం అనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు వెయ్యి ఎకరాల చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్మి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్ర ఖజానాను నింపుకొని ప్రభుత్వాన్ని నడిపించడాన్ని, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడాన్ని సీపీఐ(ఎం) తరుపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ ం భూములను ప్రజల అవసరాలకు ఉపయోగించాలి తప్ప వాటిని అమ్మి ప్రభుత్వాన్ని నడిపించడం చేతగానితనమవుతుందని విమర్శించారు. ప్రభుత్వ భూములు రాష్ట్రంలో ఏయే విధాలుగా ఎంత భూమి ఉంది అనేది వాటి వివరాలను ప్రజలకు తెలియజేయాలని, వాటి మీద శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ప్రజల భూములేనని వాటిని ఏకంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం అమ్మేస్తే ప్రజలకు ఇంకా నష్టం చేసిన వారవుతారని హెచ్చరించారు. ఒక వైపు ప్రభుత్వ స్థలాలు లేకనే ఎన్నికలకు ముందు ఇచ్చి నటువంటి వాగ్ధానాలు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేకపోతున్నామని చెబుతూ ఇప్పుడు రాష్ట్ర ఖజానా నింపి ప్రభుత్వన్ని నడపడం కోసం స్థలాలను సేకరించి మరి అమ్మడం హేయమైన చర్యగా భావించాన్నారు . ప్రభుత్వానికి చేతనైతే ప్రయివేటు భూములను కొని ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను, ఆసుపత్రులను నిర్మించాలన్నారు. అలాగే రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తేనే వారికి పంటసాగుకు పెట్టుబడి వస్తుందని లేకపోతే రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారన్నారు. విత్తనాలలో, ఎరువులలో, క్రిమిసంహారక మందులలో కల్తీలను అరికట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చేయించుకోలేక ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు పెంచాలన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో జరిగిన పరిణామాలు, మరణాలు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించకపోవడమే కారణమన్నారు. దీనిని దష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇలాంటి విపత్తు సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రానికి ,రాష్ట్రనికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి మిర్యాల వెంకన్న, సభ్యులు మిర్యాల భరత్, యసరాని వంశీ, యసరాని శివ, యాట వంశీ తదితరులు పాల్గొన్నారు.