Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవాన్ల కుటుంబాలకు అండగా ప్రభుత్వం
- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- సూర్యాపేటలో సంతోష్‌బాబు విగ్రహం ఆవిష్కరణ
నవతెలంగాణ - సూర్యాపేట
దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్‌బాబు చిరస్మరణీయుడని, జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో పర్యటించారు. ముందుగా భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన సంతోష్‌బాబు మొదటి వర్ధంతి సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం సంతోష్ బాబు కుటుంబానికి ఇప్పటి వరకూ అండగా ఉన్నామని, మున్ముందు కూడా అండగా ఉంటామని హామీనిచ్చారు. కల్నల్ సంతోష్ బాబు మృతి చెందిన తర్వాత సీఎం కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశానికీ స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేర వేసినట్లైందని అన్నారు. మంత్రులుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్న తాను కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ చనిపోయి కూడా జాతి ఉన్నంత కాలం పేరు నిలబడడం కొందరికే సాధ్యమవుతుందని, అందులో సంతోష్ బాబు పేరు ఉండడం ఆయన అదృష్టమన్నారు. తక్కువ కాలంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి శ్రీనివాసరెడ్డిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, సూర్యాపేట జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్ రావు, పూల రవీందర్, రాష్ట్ర వ్యవసాయ, గిడ్డంగుల చైర్మెన్ మందుల సామెల్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి, డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మెన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు, స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పల లలితా ఆనంద్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మరో ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామంజుల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్టా కిషోర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
బీ, సీ,డీ, ఈ మార్కెట్ బ్లాక్‌లకు శంకుస్థాపన
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకీత మార్కెట్ సముదాయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ సముదాయాల ప్రాంగణంలో మరో రూ.7 కోట్లా 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన బీ,సీ,డీ,ఈ బ్లాక్‌లతో పాటు రూ.21.69 లక్షల అంచనా వ్యయంతో పోస్టాఫీస్ నుంచి ధర్మభిక్షం విగ్రహం వరకు నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణానికి మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో జరుగుతున్న ప్రగతిపై స్థానిక పురపాలక శాఖా ఏర్పాటు చేసిన చిత్రాలను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, మూడు నెలల్లో తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ అన్నపూర్ణమ్మ, మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్:ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నగరికల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ 80 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, రూ 22 లక్షలతో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 2018 లో ప్రారంభించిన రైతుబంధు పథకం ద్వారా ఏటా 15 వేల కోట్లు పెట్టుబడిగా రైతులకు అందజేస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి ధాన్యం అత్యధికంగా సాగు చేసి తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా మారిందన్నారు. వానకాలం, యాసంగి రెండు పంటలకు గాను 60 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారిందన్నారు.నాడు 30 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తే నేడు కోటీ6 లక్షల ఎకరాలను సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించి సంఘటితం చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మించారన్నారు. ఆ వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకై నా జాతీయ హోదా కల్పించిదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రెండు దశాబ్దాల ముందు గానే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతు వేదికల ద్వారా రైతులు తమ అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకొని తమ ఉత్పత్తులను అధికంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. రైతుల పాలిట దేవాలయాలుగా రైతు వేదికలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పట్టణంలో మున్సిపల్ కార్యాలయ భవనం, సెంట్రల్ లైటింగ్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. పట్టణంలో మరో రెండు వైకుంఠదామాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్ కుమార్, నోముల భగత్, ఎన్.భాస్కర్ రావు, డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జెడ్పీటీసీ ధనలక్ష్మి నగేష్ గౌడ్, ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ రావు, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
కేతెపల్లి : రాష్ట్రంలోనే వివిధ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.మండలంలోని భీమారం గ్రామంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అదనపు తరగతి గదుల భవనాన్ని వైకుంఠధామం, రైతు వేదికను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనత దక్కుతుందని చెప్పారు. వరి ధాన్యం దిగుబడిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శమైతే రాష్ట్రానికి నల్లగొండ జిల్లా ఆదర్శవంతమైనదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి వాటిని అంచెలంచెలుగా పరిష్కరిస్తామని చెప్పారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరచడంలో తెలంగాణ రాష్ట్ర దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ బడుగుల శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.