Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకు కూరలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
- 975 హెక్టార్లకు డ్రిప్ మంజూరు
- ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ పీడీ సంగీతలక్ష్మీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మనుషులకు ఆరోగ్య పరమైన సమస్యలు వస్తున్న ప్రతి సారీ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. ఈ సారి ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో కూడా అదే విషయాన్ని వైద్యశాస్త్రం కూడా గుర్తు చేసింది. దీంతో ఎలాంటి ఎరువులూ ఉపయోగించన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తినాలనే ఆలోచన ప్రజల్లో పెరిగింది. వారి ఆలోచనలు, అవసరాలకు అనుగు ణంగానే జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటలు పెంచాల్సిన అవసరాన్ని తమ శాఖ కూడా గుర్తించిందని, అందు కోసం ఈసారి ఉద్యానవన పంటల సాగు ఆ దిశగానే సాగుతుందని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జి.సంగీతలక్ష్మీ తెలి పారు. మంగళవారం ఆమె నవ తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆయిల్ఫామ్ తోటల విస్తీర్ణం గురించి చెప్పండి ?
ఆయిల్ఫామ్ ప్రాధాన్యత పెరిగింది. జిల్లాలో ఉన్న భూములు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అందు వల్ల ఈ ఏడాది ఆయిల్ఫామ్ తోటల విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. అయితే ఇప్పటికే జిల్లాలోని త్రిపురారం, మిర్యాలగూడ, నిడమనూర్, తిప్పర్తి, తిరుమలగిరిసాగర్, మాడ్గులపల్లి, అనుముల్లో పంటలు సాగువుతున్నాయి. మిగతా 24 మండలాల్లో సాగు చేయాలని కృషి జరుగుతుంది. ఈ తోటలు సాగు చేసే రైతుకు ఒక హెక్టారుకు రూ.12000 మొక్కల కోసం రాయితీ సౌకర్యం కల్పిస్తారు. అంతేగాకుండా వరుసగా నాలుగేండ్లు ప్రతి ఏటా రూ.5 వేల చొప్పున ఎరువుల కోసం ప్రభుత్వం ఇస్తుంది.
ఆకు కూరల సాగుపై ఎలాంటి దృష్టి పెట్టారు ?
జిల్లాలో ప్రస్తుతం 3వేల ఎకరాల్లో కూరగాయల సాగు ఉంది. అయితే ఇపుడు సీజన్ మొదలైనందున మరింత విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా సీరియస్గా మా వంతు కృషిని కొనసాగిస్తాం. దాదాపు మరో 2500 ఎకరాల్లో సాగు పెంచుతాం. హైదరాబాద్లోని జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నుంచి రైతులకు మిర్చి, టమాట, వంకాయ, క్యాబేజీ, గోబి విత్తనాలను 80 శాతం రాయితీపై అంది స్తున్నారు. మన కార్యాలయం నుంచి ఎలాంటి విత్తనా లూ అందజేసే అవకాశంలేదు. ఉద్యానవన రైతులు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఆకు కూరల ప్రాధాన్యత ఇప్పుడు బాగా పెరిగింది. మనిషికి సంపూర్ణ పౌష్టిక ఆహారం కావాలంటే ఆకు కూరల తప్పనిసరి. అందుకే వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. ప్రస్తుతం ఆకు కూరలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల వినియోగదారుల అవసరాలకు అందుబాటులో లేకుండా పోయాయి. అందువల్ల పెద్దఎత్తున సాగుకు చర్యలు తీసుకుంటాం. రైతులకు తమ వంతు సహకారం అందించి ప్రోత్సహిస్తాం.
పండ్లతోటల సాగు గురించి వివరించండి ?
పండ్లతోటల సాగులో ప్రధానంగా బత్తాయి సాగు తగ్గింది. కానీ కొత్త రకమైన పండ్లతోటల సాగు రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్స్ పంట సాగును విద్యావంతులైన రైతులే ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే పంట సాగు సమయంలో కొంత ఆర్ధికంగా ఖర్చు అధికమైన తర్వాత ఆదాయం కూడా వస్తుంది. మన జిల్లాలో ఇపుడు సుమారు 100 ఎకరాలకు పైగానే సాగు చేస్తున్నారు. సుమారు 25 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. ఆ కాలమంతా పెట్టుబడి కూడా నామమాత్రంగానే ఉంటుంది. ఆదాయం మాత్రం ఉన్నతంగా ఉంటుంది.
డ్రిప్ మంజూరు ఎలా ఉంది ?
జిల్లాకు 975 హెక్టార్లకు సరిపడే విధంగా ప్రభుత్వం డ్రిప్పులు మంజూరు చేసింది. కానీ ఆన్లైన్లో ఇప్పటికే 2000 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో డ్రిప్కు ఉన్న ధర ఇపుడు ఉన్న ధరలో కొంత వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే. అయినా కంపెనీ యాజమాన్యం గతంలో ఇచ్చిన మాట ప్రకారం అందజేసేందుకు ముందుకు వస్తున్నాయి.
యాంత్రీకరణ పథకం వచ్చే అవకాశం ఉందా ?
గతంలో ఉన్న యాంత్రీకరణ పథకం ఈసారి మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది. ఎంఐడీహెచ్ పథకంలో భాగంగానే దీనికి నిధులు మంజూరు చేయనున్నారు. అయితే భారీ యంత్రాలు, పనిముట్ల కాకుండా చిన్న చిన్న పనిముట్లనే రైతులకు అందించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు అయితే ఏ పరికరం తీసుకున్నా రూ.75 వేల వరకు మాత్రమే రాయితీ సౌకర్యం లభిస్తుంది.