Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యమా...పాలకవర్గంతో విబేధాల ?
నవతెలంగాణ - నల్లగొండ
నల్లగొండ మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర లాంగ్‌లీవ్ పెట్టారు. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విధులకు సెలవు పెట్టారు. తిరిగి 11వ తేదీన విధులకు హాజరు కావాల్సిన కమిషనర్ తిరిగి ఆ సెలవును ఈ నెల 24వ తేదీ వరకూ పొడిగించుకున్నారు. ఇక్కడ చేయలేకనే ఆయన వెళ్లి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని సెలవు పెట్టినట్టు తెలిసింది. ఇప్పటికీ మూడుసార్లు లాంగ్‌లీవ్ పెట్టిన కమిషనర్ తిరిగి విధుల్లోకి రాకపోవొచ్చనే ప్రచారం కార్యాలయంలో జోరందుకుంది. కమిషనర్ లేకే పోవడంతో కార్యాలయంలో వివిధ పనులకు సంబంధించిన ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకు పోయాయి.
పాలకవర్గమే కారణమా..
మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర 14 రోజుల పాటు వరుస సెలవులు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అనారోగ్యంతో సెలవు పెట్టారా..లేక పాలక వర్గంతో వచ్చిన విభేదాలే ఇందుకు కారణమా...దానిపై చర్చ సాగుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కమిషనర్ నిర్వహించకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మే నెలకు సంబంధించిన మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లించేందుకు కమిషనర్ శరత్ చంద్ర కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ వేతనాలను టీఎల్ఎఫ్ ద్వారా చెల్లించేందుకు రూ.1.10 కోట్ల చెక్కును జారీ చేశారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా చెక్కు జారీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని..ఇందులో ఏదో మతలబు ఉందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటని పాలక వర్గం కమిషనర్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కమిషనర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓ పార్టీ అభ్యర్థికి సహకరించారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
పేరుకు పోయిన ఫైళ్లు ..నిలిచిన పనులు
మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, శానిటేషన్, రెవెన్యూ, జనన మరణ వంటి విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలకు రోజుకు కనీసం 50 నుంచి 100 ఫైళ్లపై కమిషనర్ సంతకం చేయాల్సి ఉంటుంది. వారం రోజుల నుంచి కమిషనర్ సెలవుపై ఉండటంతో ఆయా విభాగాల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు పట్టణంలో జరిగే అభివృద్ధి పనులు కూడా వేగవంతం కాలేక పోతున్నాయి.
గత కమీషనర్లు ఇదే పని .....
నల్లగొండ మున్సిపాలిటీలో గతంలో పని చేసిన కమిషనర్లు కూడా లాంగ్‌లీవ్ పెడుతూ వచ్చారు. ఇంత వరకు ఏ ఒక్క కమిషనర్ కూడా పూర్తి స్థాయి విధులు నిర్వహించలేదు. ఇందుకు పాలక వర్గం ఒత్తిడియే కారణమని స్థానికులు చెబుతున్నారు.