Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో చనిపోయిన వారి ప్రతి ఇంటికీ రూ.5 వేలు
- నార్కట్‌పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి ఔదార్యం
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మండలంలో ఉన్న ఆరోగ్య సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులనూ సమన్వయం చేసుకుంటూ ఆపదలో ఉన్న వారికి ధైర్యం చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు నార్కట్‌పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఆయన ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. వైరస్ వచ్చిన ప్రతి బాధితుని ఇంటికీ వైద్య సిబ్బంది వెళ్లడం నిత్యం పర్యవేక్షించడం వారికి భరోసా ఇవ్వడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మండల పరిధిలోని నార్కట్‌పల్లి, అక్కినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, 70 మంది ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తూ పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి ఆశా కార్యకర్త ప్రతి ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరించడం, కరోనా లక్షణాలు ఉన్న వారిని వైద్య పరీక్షలకు పంపడం, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇంటి వద్దే వైద్య సౌకర్యాలు అందించే విధంగా వైద్య అధికారులతో వారాంతపు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండి వైద్యం అందుబాటులో రాక ఎవరూ చనిపోవద్దని నిత్యం ఆక్సిజన్ లెవెల్స్‌ను పరిశీలించేందుకు సొంతంగా రూ.70 వేలతో ఆక్సీమీటర్లను ప్రతి ఆవా కార్యకర్తకు అందించారు. ఆశా కార్యకర్తలు మనో ధైర్యంతో పనిచేసే విధంగా వారికి మాస్కులు, ఫేస్‌ఫీల్డ్, గ్లౌజెస్ అందజేయడంతో పాటు వారికి కష్టాలు ఉంటే తాము అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
కరోనా వైరస్‌తో చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 వేలు
మండల పరిధిలోని తొండలవాయి గ్రామంలో కరోనా వైరస్ బారినపడి ఆర్థికంగా చితికి పోయి అంత్యక్రియలకు సైతం ఇబ్బంది పడ్డ కుటుంబాన్ని చూసి చలించిపోయిన ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి ఆ కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అంతే కాకుండా మండలంలో వైరస్ బారిన పడి చనిపోయిన ప్రతి కుటుంబానికి తన సొంత నిధుల నుంచి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించి ఇప్పటి వరకు 30 కుటుంబాలకు అందజేశారు. ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలుస్తూ మండలంలో వైద్య సౌకర్యాలు మెరుగు పరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నరేందర్‌రెడ్డి.