Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ట్రాక్టర్ కిరాయిలు రోజువారి సగటున 35 శాతం నుంచి 58 శాతం పెరిగాయన్నారు. కానీ రైతులకు మద్దతు ధర మాత్రం కేవలం నాలుగు శాతం మాత్రమే పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరికి రూ.4137, పత్తికి రూ.1,4093 మద్దతు ధర నిర్ణయించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తే కేంద్రం కంటితుడుపుగా వరి ఏ గ్రేడ్ రకానికి రూ.1960, పత్తికి రూ.6025 ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తి కాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్న కారు రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, రైతు బీమా వయస్సు 75 ఏండ్లకు పెంచాలని కోరారు. ప్రభుత్వ భూములు అమ్మేందుకు జారీ చేసిన జీవో 13ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.కరోనాతో చనిపోయిన రైతు కూలీలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పెట్రోల్, డీజిల్‌పై అన్ని రకాల పన్నులనూ రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పంటల మద్దతు ధరకు చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.డేవిడ్‌కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా నాయకులు కాకి మోహన్‌రెడ్డి, పెద్దింటి రంగారెడ్డి, అలుగుబెల్లి వెంకట్‌రెడ్డి, కోట మధుసూదన్‌రెడ్డి, కారంగుల వెంకన్న, ఉదయగిరి సైదులు, అంజయ్య, సత్యం, ముత్తయ్య, నాగయ్య, వెంకన్న, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.