Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ ఐదు వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 19,24,30వతేదీల్లో దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు.శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యప్రజలపై భారం మోవుతుందని విమర్శించారు.గడిచిన నెల రోజుల్లోనే సుమారు 30 సార్లు ధరలు పెంచి ప్రజలపై ఆర్థికభారం మోపారని విమర్శించారు.ఒకపక్క కరోనాతో ప్రజలు తీవ్ర ఆర్థికఇబ్బందులు పడుతుంటే మరోపక్క ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపడం సరికాదన్నారు. ఉపాధిలేక పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారని, పేదలను ఆదుకోవాల్సిందిగా పోయి భారాలు మోపడం సరికాదన్నారు.తద్వారా ప్రభుత్వం తమ ఖజానాను నింపుకుంటుందని విమర్శించారు.ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.తెలంగాణలో ఈనెల 19న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నానిర్వహిస్తున్నట్టు తెలిపారు.24న అన్ని పెట్రోల్‌బంకుల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ నెల 30న రాజ్ భవన్ ముందు ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.19న జరిగే జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు వామపక్షాల కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, నూకల జగదీష్‌చంద్ర, డాక్టర్ మల్లుగౌతంరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎమ్‌డి.అంజద్ పాల్గొన్నారు.
సూర్యాపేట:పెరుగుతున్న పెట్రోలు,డీజిల్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈనెల 30 వరకు జిల్లావ్యాప్తంగా జరుగు నిరసన ప్రదర్శనలు ఉంటాయని, వాటిని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో ఆయన సీపీఐ, సీపీఐ ఎంఎల్న్యూడెమోక్రసీ,సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం జిల్లా కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, మండారి డేవిడ్‌కుమార్,కొత్తపల్లి శివకుమార్‌తో కలిసి మాట్లాడారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు.కార్పొరేట్‌శక్తులకు లాభాలు చేకూరుస్తూ పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ప్రయివేట్‌కు దోచిపెడుతున్నారని విమర్శించారు.ప్రధాని మోడీ కార్పొరేట్‌శక్తులకు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని విమర్శించారు. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై భారాలు మోపుతుండడం సిగ్గుచేటన్నారు.వ్యవసాయ సీజన్ ప్రారంభమయినందున రైతులకు విత్తనాలు,ఎరువులు అందిచాలన్నారు.రాష్ట్రంలో నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల అమ్మకాలు జోరుగా సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోలు,డీజిల్ నిత్యావసర సరుకుల ధరల భారం, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నెల 19 నుండి 30 వరకు వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరుగు నిరసన లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 19 వ తేదీన జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు ,24వ తేదీన ఆయిల్ కంపెనీల ముందు నిరసన ప్రదర్శనలు, 30వ తేదీన జిల్లా కలెక్టరేట్,రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఈ సమావేశంలో సీపీఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు కోటగోపి, సీపీఐ జిల్లా నాయకులు దోరెపల్లి శంకర్, దంతాల రాంబాబు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, చంద్రన్న వర్గం నాయకులు ఆరుట్ల శంకర్‌రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు గాలి కష్ణ, సీపీఐ(ఎం) నాయకులు చిన్నపంగు నర్సయ్య పాల్గొన్నారు.